Hyderabad News: హైదరాబాద్ సమీపంలోని  బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ నిర్మాణం సమీపంలో ఉన్న ఏడుగురు ఈ శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలేశారు. 


బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం జరిగింది. స్థానికంగా ఓ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. అందులో పని చేసేవాళ్ల కోసం ఓ షెడ్‌ ఏర్పాటు చేశారు. అయితే  రాత్రి కురిసిన వర్షానికి ఆ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ సెంట్రింగ్‌ రాడ్స్‌ ఒరిగిపోయాయి. దీంతో అవి ఒక్కసారిగా పక్కనే కార్మికులు ఉంటున్న షెడ్‌పై పడ్డాయి. 


షెడ్‌లో ఉన్న వారిపై ఒక్కసారిగా స్లాబ్ సెంట్రింగ్‌ రాడ్లతో పడినందుకు వాళ్లెవరూ బయటకు రాలేకపోయారు. దీంతో పెను ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. జేసీబీల సాయంతో ఏడు మృతదేహాలను వెలికి తీశాయి. 


మృత్యువాత పడిన వారంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి ఏసీపి శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. రైజ్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.