Hyderabad News: హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈదురు గాలులతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్.ఏ.ఎం రిజ్వి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన చేయూతను అందించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.