Hyderabad Metro Rail News: హైదరాబాద్ లో మంగళవారం (మే 7) సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి మెట్రో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ క్లారిటీ ఇచ్చింది. భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా అంతరాయం కలగలేదని మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


హైదరాబాద్‌ సహా కరీంనగర్ లో అధికంగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు కూడా వీచాయి. దీనివల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడి మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది ముందు జాగ్రత్తగా మెట్రో రైళ్లను నిలిపేశారని ప్రచారం చేశారు. తాజాగా ఈ ఫేక్ వార్తలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు.


మరోవైపు, రోడ్లపై ట్రాఫిక్ జామ్ వల్ల బస్సులకు వెళ్లే వారు సైతం మెట్రో రైళ్లకు వెళ్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రోలో వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా మెట్రో స్టేషన్లకు వెళ్తుండడం వల్ల అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో రద్దీ నెలకొంది. చాలా మెట్రో స్టేషన్లలో సాధారణం కంటే అధికంగా జనాలు కనిపించారు.


ఇక హైదరాబాద్ లో వర్షం కురవడం వల్ల రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. చాలా చోట్ల వాహనాలు ముందుకు కదల్లేదు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటి వల్ల వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్‌, ఆల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్ పల్లి, చిలకలగూడ,  జీడిమెట్ల, మలక్‌పేట, ఎర్రగడ్డ, బోయిన్‌పల్లి, సుచిత్ర, ప్యాట్నీ, ఎల్బీనగర్‌, కాప్రా, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడ్ పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు బాగా వచ్చి చేరింది. 


ఇటు ఉమ్మడి కరీంనగర్‌ వ్యాప్తంగానూ బాగా వర్షం పడింది. దీనివల్ల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు అయింది. కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, ములుగు జిల్లాలలో కూడా చాలా చోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ, మల్యాల, మానుకొండూరు, హుజూరాబాద్‌, పెద్దపల్లిలో వర్షం పడి పంట ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో కూడా భారీ వర్షం పడింది.