Judgment Copy of Bandla Krishna Mohan Reddy:


గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై హైకోర్టు వేటు వేసింది. 6 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించింది. గద్వాల్ ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ప్రకటిస్తే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   


తీర్పు కాపీలో సంచలన అంశాలు...
గద్వాల మాజీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తీర్పు కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని హై కోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్.. కృష్ణమోహన్‌ రెడ్డిపై అనర్హత వేటు వేశారు.  ప్రజలను మోసం చేసినందుకు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పు కాపీలో పేర్కొన్నారు. కృష్ణమోహన్ రెడ్డికి కోర్టు మూడు లక్షల జరిమానాను విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఇందులో గద్వాల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. 


కొత్తగూడెం ఎమ్మెల్యే తరహాలో గద్వాల ఎమ్మెల్యేపై వేటు.. 
ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా పదవి కోల్పోయారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా  సుప్రీంకర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా చేతిలో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టే వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. వనమా వెంకటేశ్వర రావు సైతం బీఆర్ఎస్ టికెట్ పొందారు. కానీ కోర్టులో విషయం తేలి అనర్హత వేటు కొనసాగితే మాత్రం ఆయన సైతం కొన్నేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు.


2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో విజయం సాధిచారు. గత నాలుగేళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  అయితే కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. 


కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఓడిన జలగం వెంకట్రావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది అయితే. వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకూ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసినందున.. తీర్పును ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్ వెంటనే అమలు చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సైతం వనమా తరహాలోనే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కల్పించనుంది హైకోర్టు. సుప్రీంకోర్టులో స్టే లభిస్తే... పదవి కాలం ముగిసిపోయే వరకూ తేలే అవకాశం ఉండదు, కనుక కృష్ణమోహన్ అప్పటివరకూ కొనసాగే ఛాన్స్ ఉంది.