BRS MLA Marri Janardhan Reddy Warns Congress Leaders:


తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. సీఎం కేసీఆర్ ఇదివరకే 115 అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేశారు. సీట్లు దక్కని వారు పార్టీని వీడుతుండగా, కొందర్ని బుజ్జగిస్తున్నారు. మరోవైపు తమకు కేసీఆర్ మరోసారి ఛాన్స్ ఇవ్వడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జోలికొస్తే కాల్చి పడేస్తా అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.


నాగర్ కర్నూల్ జిల్లాలోని తెల్కపల్లి మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఎమ్మెల్యే మర్రి ఆదివారం రాత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదని, తాను పీకి పారేస్తే చెయ్యి ఇలా వెళ్లిపోతుందన్నారు. తనకు వ్యతిరేకంగా నిలిస్తే మీకు నష్టం, నా క్యాడర్ కు చెబితే మీరు ఇక్కడ తిరగలేరు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలను మెచ్చరించారు. తన జోలికొస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సంగతి మీకు తెల్వదు.. దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ నేతలు ఇక్కడ తిరగలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 స్థానాల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ఛాన్స్ ఇచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన మర్రి జనార్దన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గూలాబీ పార్టీ తరపున మరోసారి బరిలో దిగనున్నారు. అయితే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే మర్రి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను బహిరంగంగా హెచ్చరించడం స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది.


కాంగ్రెస్ లో ఉన్నది మనోళ్లే.. బాల్క సుమన్
ఓవైపు కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తా అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మర్రి జనార్ధన్ రెడ్డి ఇవ్వగా.. చెన్నూరులో బాల్క సుమన్ అయితే కాంగ్రెస్ లో ఉన్నది మనోళ్లే అనడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో  ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లను ఏం అనొద్దని, అందులో ఉన్నది మనోళ్లే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​లో ఉన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తుచేశారు. మనమే కాంగ్రెస్ పార్టీలోకి కొందర్ని పంపించా అని చెప్పడం రాజకీయంగా దుమారం రేపింది.  


తమ పార్టీలో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ సభ్యుడు నూకల రమేశ్ అన్నారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. దమ్ముంటే కోవర్టు ఎవరో చెప్పాలని బాల్క సుమన్ ను ప్రశ్నించారు.