Missing Cheques: ఈ రోజుల్లో కాదేది మోసానికి అనర్హం. ఎటు చూసినా మోసమే. డేటా చోరీ, మనీ చోరీ, సైబర్ నేరం, ఇలా అన్నీ చోరీలే. క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఒకరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ మరొకరు, క్రిప్టోలో లాభాలంటూ ఇంకొకరు ఇలా ఎదుటి వారిని మోసం చేస్తూనే ఉంటారు. చివరికి సొంతవాళ్లను కూడా నమ్మలేని పరిస్థితి. ఫోన్ పే స్క్రాచ్ కార్డు పేరుతో ఖాతా ఖాళీ చేస్తా మరొకరు ఏకంగా బ్యాంకుల్లో వేసే చెక్లనే కాజేస్తున్నారు.
ఇటీవల హైదారాబాద్ నగరంలోని ఏటీఎం కియోస్క్‌లలో చెక్కులు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు వినియోగదారులకు పలు సూచనలు చేస్తున్నారు. చెక్కులను అజాగ్రత్తగా డ్రాప్‌బాక్సుల్లో వేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇటీవల డ్రాప్‌బాక్స్‌లో వేసిన తమ చెక్కులు కనిపించకుండా పోయాయంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కియోస్క్‌ల వద్ద ఉన్న డ్రాప్‌బాక్స్‌లను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు చెక్కులను చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
దొంగలు చెక్కులను దొంగిలించి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ముందు వాటిని తారుమారు చేస్తున్నారని పోలీస్ అధికారులు తెలిపారు. ఆ మొత్తాన్ని ఇతర నగరాల్లోని థర్డ్ పార్టీ ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో ప్రతి నెలా ఇటువంటి కేసులు మూడు, నాలుగు నమోదవుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు వినియోగదారులు పలు సూచనలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, సెక్యూరిటీ గార్డులు కాపలా ఉన్న డ్రాప్ బాక్స్‌లలో మాత్రమే ప్రజలు తమ చెక్కులను డిపాజిట్ చేయాలని పోలీసులు కోరారు. చెక్‌ను తారుమారు చేయడం కష్టంగా ఉండే విధంగా స్క్రిప్ట్‌ను రూపొందించాలని ఖాతాదారులకు పోలీసులు సూచించారు.
మోసగాళ్లు డ్రాప్ బాక్స్‌ల నుంచి చెక్కులను దొంగిలించి, బేరర్/లబ్ధిదారుడి వివరాలను గుర్తించిన తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. చెక్‌లో ఉన్న వివరాలతో దూరంగా ఉన్న ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఖాతాలు తెరుస్తున్నారు. తరువాత వాటికి బ్యాంకుల్లో వాటిని మార్చి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. చెక్కు మొత్తం క్రెడిట్ అయిన తర్వాత వెంటనే దొంగలు డబ్బు విత్‌డ్రా చేస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చెక్కుల చోరీకి గురికాకుండా ఉండేందుకు ఏటీఎంలలో ట్యాంపర్ ప్రూఫ్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని పోలీసులు బ్యాంకులకు సూచించారు. అంతేకాదు చెక్కులపై ఖాళీ స్థలం ఉంచవద్దని సూచిస్తున్నారు.