ఆదివారం... సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డు... ఎటు చూసినా రద్దీగా ఉంది. మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమం కోసం ఏసీపీ రవీందర్ యాదవ్ బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు. అటువైపుగా బస్సులో వెళ్తున్న ఓ మహిళ ఏసీపీ రవీందర్‌ను చూసింది. బస్సు దిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. నన్ను గుర్తుపట్టారా సార్ అంటూ కన్నీరుపెట్టుకుంది. నేను బతికున్నానంటూ మీవళ్లే అని చెప్పింది. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. అది చూసి.. అక్కడున్న వారంతా షాకయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. అయోమంలో పడ్డారు. మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి... ఏసీపీకి ఎందుకు థ్యాంక్స్ చెప్తుందో అర్థంకాక అలా చూస్తూ ఉండిపోయారు. చివరికి విషయం తెలుసుకుని... ఏసీపీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బస్సు దిగి పరిగెత్తుకుంటూ వచ్చిన మహిళ పేరు కవిత. ఈమెది కార్వాన్. ఇప్పుడు మహంకాళి ఏరియా ఏసీపీగా ఉన్న రవీందర్ యాదవ్... 2014లో టప్పాఛబుత్ర పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఓ రోజు... కార్వాన్‌కు చెందిన కవిత రోడ్డుపై అనారోగ్యంతో బాధపడుతూ ఏసీపీకి కనిపించింది. ఆయన వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. తన సొంత డబ్బుతో వైద్యం చేయించారు. ఆపరేషన్‌కు కూడా డబ్బులు ఇచ్చారు. ఇది జరిగి దాదాపు 9ఏళ్లు కావస్తోంది. అప్పుడు ఏసీపీ చేసిన సాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు మహిళ.
ఆదివారం... ఆ మహిళ సికింద్రాబాద్ మీదుగా బస్సులో వెళ్తోంది. అదే సమయంలో అక్కడ బందోబస్తు డ్యూటీ నిర్వహిస్తున్నారు ఏసీపీ రవీందర్. బస్సులో వెళ్తున్న కవిత ఆయన్ను చూడగానే కృతజ్ఞతా భావం పొంగుకొచ్చింది. వెంటనే ఆమె బస్సు దిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. సాయం చేసిన వారి మర్చిపోయినా... సాయం పొందినవారు మర్చిపోరు కదా. 9ఏళ్ల క్రితం చేసిన సాయాన్ని ఏసీపీకి గుర్తుచేసింది ఆ మహిళ. సార్.. నేను కవితను.. గుర్తున్నానా అని అడిగింది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అందుకే మీరే కారణం సార్ అంటూ అంటూ కన్నీరు పెట్టుకుంది. మీ కోసం వెండి రాఖీ తీసుకున్నా సార్... పండుగ రోజు వచ్చి కడుతానని చెప్పింది. తన ఫోన్‌లో ఉన్న ఏసీపీ ఫోటోను అందరికీ చూపించింది. ఆమె కృతజ్ఞతకు ఏసీపీతో పాటు అందరు ఆశ్చర్యపోయారు.
ఏసీపీ ఫోన్ నంబర్ తీసుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది మహిళ. ఇది చూసిన స్థానికులు ఏసీపీపై ప్రసంశల వర్షం కురిపించారు. హ్యాట్సాఫ్ పోలీస్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయడం మానవధర్మం. పక్కవారికి మంచిచేస్తే... మనకూ మంచిజరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక... ఎవరు కష్టాల్లో ఉన్నా చేతనైన సాయం చేయాలి. మానవత్వంలో ప్రవర్తించాలి ఈ ఏసీపీలా.