తెలుగు రాష్ట్రాల మధ్యన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి (జనవరి 15) ప్రారంభం కానుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే, దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకొచ్చాయి. సోమవారం (జనవరి 16) నుంచి జరిగే ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ అనేవి ఉన్నాయి. అయితే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో.. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. చైర్ కార్, ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.


విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.3,170గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే సర్వీసులో విశాఖపట్నానికి ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా పేర్కొన్నారు. ఈ టికెట్‌ రేట్లలో కొంచెం తేడా ఉంది. సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. అయినా అప్ అండ్‌ డౌన్‌ ట్రైన్‌ టికెట్‌ ధరలు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో కలిసిపోయి ఉన్న కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండడంతో ఈ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.


సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ రైలు ఛైర్‌కారును టికెట్‌ ధర విడివిడిగా ఇలా..
* బేస్‌ ఫేర్‌ రూ.1,207
* రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40
* సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45 
* మొత్తం జీఎస్టీ రూ.65 
* రైల్లో ఇచ్చే ఫుడ్‌కి రూ.308 


విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వందే భారత్‌ రైలు ఛైర్‌కారును టికెట్‌ ధర విడివిడిగా ఇలా..
* బేస్‌ ఛార్జీని రూ.1206
* కేటరింగ్‌ ఛార్జీ రూ.364 (ఇక్కడే టికెట్‌ ధరలో రూ.60 తేడా)


వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌ నడుస్తున్న షెడ్యూల్‌ను బట్టి అందించే ఫుడ్‌లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ఉదయం ఇచ్చే ఫుడ్ వేరు. రాత్రి ఇచ్చే ఆహారం వేరు. అందుకే టికెట్ ధరల్లో తేడా కనిపిస్తోంది.


* సికింద్రాబాద్‌ - విశాఖపట్నం (SC - VSKP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20834


నుండి                   వరకు                 ఛార్జీ (చైర్ కార్)         ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
సికింద్రాబాద్          వరంగల్                   రూ.520                    రూ.1,005
సికింద్రాబాద్           ఖమ్మం                    రూ.750                    రూ.1,460
సికింద్రాబాద్        విజయవాడ                  రూ.905                    రూ.1,775
సికింద్రాబాద్      రాజమహేంద్రవరం           రూ.1365                  రూ.2,485
సికింద్రాబాద్‌         విశాఖపట్నం               రూ.1665                   రూ.3,120


* విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ (VSKP - SC) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833 


నుండి                   వరకు                 ఛార్జీ (చైర్ కార్)         ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
విశాఖపట్నం     రాజమహేంద్రవరం           రూ.625                        రూ.1,215
విశాఖపట్నం          విజయవాడ               రూ.960                        రూ.1,825
విశాఖపట్నం             ఖమ్మం                 రూ.1,115                     రూ.2,130
విశాఖపట్నం            వరంగల్‌                రూ.1,310                     రూ.2,540
విశాఖపట్నం         సికింద్రాబాద్              రూ.1720                       రూ.3,170