Secunderabad Girl Kidnap Case: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పాప కృత్తికా ను సైకో రాము కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైకో రాము బారి నుంచి పాపను రక్షించారు. సిద్దిపేట జిల్లాలో పాప ఆచూకీ లభ్యమైంది. మహంకాళి టెంపుల్ సమీపంలో పాపను కిడ్నాప్ చేసిన సైకో రాము అక్కడి నుంచి జేబీఎస్ వరకు ఆటోలో తీసుకెళ్లాడు. అటు నుంచి సిద్దిపేట జిల్లా దూల్ మిట్టకి కృత్తికాను తీసుకెళ్లి పోయాడు. అక్కడ గ్రామస్థులకు అనుమానం రావడంతో కిడ్నాప్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. సర్పంచ్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పాపను సైకో రాము నుంచి కాపాడారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు చిన్నారిని తీసుకొస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారి ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆరేళ్ల పాప కృత్తికా కిడ్నాపైంది. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి ఎంతకు తిరిగిరాకపోవడం, తల్లిదండ్రులు, బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుని, వివరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీలో ఒక వ్యక్తి బాలికను తీసుకువెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాప ఆచూకీ కోసం కొన్ని గంటలపాటు పోలీసులు గాలించారు. తన కుమార్తె కృత్తికాను ఎలాగైనా రక్షించి తమకు అప్పగించాలని పాప తల్లి రేణుక పోలీసులను కోరారు.
ఈ క్రమంలో పాప ఆచూకీ దొరికిందని నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. పాప కృత్తికా ను సైకో రాము కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద పాపను కిడ్నాప్ చేసిన రాము అక్కడి నుంచి ఆటోలో జేబీఎస్ వరకు వెళ్లాడు. జేబీఎస్ లో బస్ ఎక్కి ఊరెళ్లిపోయాడు. సిద్దిపేట జిల్లా దూల్ మిట్టకి పాపను తీసుకెళ్లాడు రాము. అక్కడ గ్రామస్థులకు రాము కదలికలపై అనుమానం రావడంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసింది. స్థానికులు చెప్పగా అక్కడికి చేరుకుని సర్పంచ్ పాపను విషయం అడగగా, జరిగింది జరిగినట్లు చెప్పేసింది. దూల్ మిట్ట సర్పంచ్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పాపను సైకో రాము నుంచి కాపాడారు. మొత్తం 10 టీమ్ లతో పోలీసులు పాప ఆచూకీ కోసం గాలించినట్లు చందన దీప్తి తెలిపారు. నిందితుడు సైకో రాముపై ఐపీసీ 365 తో పాటు 325A SC, ST యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు చిన్నారిని తీసుకొస్తున్నారు.
తల్లడిల్లిన కన్న పేగు..
తమ కుమార్తె సిద్దిపేటలో దొరికిందని తెలియగానే పాప తల్లి రేణుకకు సంతోషంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సిద్దిపేట నుంచి పోలీసులు వీడియో కాల్ చేసి తల్లిని పాపతో మాట్లాడించారు. తిన్నావ అని అడగగా పాప తిన్నా అని చెప్పింది. నిన్ను ఏమైనా కొట్టాడా అని అడిగితే భయంగా తల ఊపింది. భయపడవద్దు అని నేను వచ్చి తీసుకెళ్తానని తల్లి రేణుక పాపకు ధైర్యం చెప్పింది. తన చెవి పోగులు (కమ్మలు) తీసుకున్నాడని పాప తన తల్లికి వీడియో కాల్ మాట్లాడుతూ చెప్పింది. అయితే పాప చెవి పోగుల కోసమే చిన్నారిని కిడ్నాప్ చేశాడా, లేక ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేశాడన్నది విచారణలో తేలనుంది.