Satyavathi Rathod Comments On Revanth: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె...పథకాలు అమలు చేయడానికి డబ్బుల్లేవని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ నది ప్రక్షాళణ అంటూ ఎందుకు బయల్దేరారని ప్రశ్నించారు.
ABP దేశం : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది గడిచింది. మహిళలకు ఉచిత బస్సు పథకంతోపాటు అనేక పథకాలు అమలు చేస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. మహిళలకు మేలు చేయడం మీకు నచ్చడంలేదా..?
సత్యవతి రాథోడ్..: మహాలక్ష్మీ పథకం క్రింద కాంగ్రెస్ పార్టీ నాలుగు హామీలు ఇచ్చారు. ఉచిత బస్సు, 500 రూపాయలకు సిలిండర్, ప్రతీ మహిళకు 2500రూపాయలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఒక్క ఆర్టీసి ఉచిత ప్రయాణం తప్ప ఏ పథకం అమలు చేయడంలేదు. ఆర్టీసి ఉచిత స్కీమ్ ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వడంలేదు. గ్యాస్ సిలిండర్ 90 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా కేవలం 40లక్షల మందికే ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మాటలు మాత్రమే గొప్పగా ఉన్నాయి. పని చూస్తే రోత దిబ్బలాగా ఉంది. ఆశావర్కర్లకు 18వేలు జీతం ఇస్తానని మాట ఇచ్చి ఏడాది అయ్యిందని, అమలు చేయండి అని అడిగేందుకు డైరెక్టర్ ఆఫీసుకు వచ్చిన ఆశావర్కర్లపై పోలీసుల చేత దాడులు చేయించారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన, తెలంగాణ పోరాటానికి స్పూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంతో రేవంత్ రెడ్డి విధ్వంసం పరాకాష్టకు చేరుకుంది. బతుకమ్మతో కూడిన ఓ నిండైన విగ్రహం తెలంగాణ తల్లి, అటువంటిది ఇప్పుడు బతుకమ్మ, అభయహస్తం చూపుతూ కాంగ్రెస్ తల్లిలా మారింది. తెలంగాణ తల్లి గతంలో కిరీటం పెట్టుకుని, వడ్డాణం పెట్టుకుని నిండుగా ఉంటే సహించలేని ఫ్లూడల్ దొర రేవంత్ రెడ్డి. ఆయన మాటలకు చేతలకు పొంతనలేదు.
ABP దేశం: తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెడితేనే రేవంత్ రెడ్డి సిఎం అయ్యారు. అటువంటి సిఎంకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే స్వేచ్చలేదా.. ఇందులో మీ అభ్యంతరాలేంటి..?
సత్యవతి రాథోడ్: తెలంగాణ తల్లి రేవంత్ వచ్చాక తెచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమంపై రేవంత్ కు సోయిలేదు, సొక్కులేదు. తెలంగాణాలోని ప్రతీ ఊరిలో ,ప్రతీ జిల్లాలో తెలంగాణా తల్లి విగ్రహం ఉంది. తెలంగాణా ప్రజల గుండెల్లో ఉంది. సోనియా విగ్రహాన్ని పెట్టుకో, తెలంగాణా తల్లి విగ్రహం పెట్టే హక్కులేదు. విగ్రహం మార్చి వేరే రూపం తీసుకొస్తాడని మేము అనుకోలేదు. సిఎంగా ఏడాది పూర్తి చేసుకుని సంబురాలు కాదు.నీ కౌంట్ డౌన్ మొదలైందని మర్చిపోవద్దు.
ABP దేశం: మీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పథకాలు అమలుపై మాట్లడితే హక్కు మీకు లేదనే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు మీ సమాధానం..?
సత్యవతి రాథోడ్: ఏడాదిలో తెలంగాణకు కాంగ్రెస్ చేసింది జీరో. ప్రతీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కాగ్ నివేదిక ఇస్తుంది. ఎంత ఖర్చుపెట్టారు,ఎంత అప్పుల్లో ఉన్నారనేది స్పష్టంగా కాగ్ ప్రకటన విడుదల చేస్తుంది. మీకు పరిపాలన చేతగాక, సోయిలేక మాట్లడుతున్నారు. కళ్యాణ లక్ష్మీతోపాటు మహిళలకు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చారు,ఇప్పటికీ ఇవ్వలేదు. అవ్వతాతలకిచ్చే 2వేలను 4వేలు చేస్తాcన్నారు చేయలేదు. వీటికివ్వడానికే నిధులు లేకపోతే, లక్షా యాభైవేల కోట్లతో మూసీ సుందరీకరణ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఇది ఎట్లుందంటే, బిడ్డ ఆసుపత్రులో ఉంటే తల్లి బ్యూటీపార్లర్ కు వెళ్లినట్లుంది.
ABP దేశం: మూసీని సుందరీకరణ చేసి, వచ్చే ఆదాయంతో మరింత అభివృద్ది, పథకాల అమలు చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నారేమో.. మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారు..?
సత్యవతి రాథోడ్: మూసీని బాగుచేద్దామని చాలామంది అనుకున్నారు. రేవంత్ రెడ్డి వందేళ్లు పాలించడానికి ఇక్కడకు రాలేదు. మూసిని బాగుచేయడాని ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆ తరువాతే మూసీని బాగుచేస్తారో, తనను తాను బాగుచేసుకుంటాడో చేసుకోమను.
ABP దేశం: మీ నాయకుడు కేసిఆర్ బయటకు రావడంలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకావడంలేదు. కేసిఆర్ ఎప్పుడు బయటకొస్తారు. కాంగ్రెస్ నాయకులకు మీరెచ్చే సమాధానం ఏంటి..?
సత్యవతి రాథోడ్: కేసిఆర్ ఎప్పుడు అసెంబ్లీకి రావాలో,ఎప్పుడు బయటకు రావాలో కేసిఆర్ ఇష్టం. మీరెవరు అడగడానికి. మా సభలకే మీరు అనుమతులు ఇవ్వడంలేదు. మీ రాహుల్ గాంధీకి అదానీతో ఉన్న అనుబంధం తెలుపుతూ టిషర్లు వేసుకుంటే అసెంబ్లీ లోపలకి రానివ్వడంలేదు. అదే మీరు పార్లమెంట్‌లోకి వెళ్లొచ్చు. మా ప్రశ్నలకు మీకు సమాధానం లేదు. కేసీఆర్ మూడో కన్ను తెరిస్తే మీరు తట్టుకోలేదు. సరైన సమయంలో, సరైన వేదికపై కేసిఆర్ వస్తారు. మేము ఎలా నడుచుకోవాలో రాజకీయంగా మాకు కేసిఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు.