సరూర్ నగర్ లో అప్సర అనే యువతిని పూజారిగా ఉన్న సాయిక్రిష్ణ హత్య చేయడానికి గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మ్యాన్ హోల్ నుంచి వెలికి తీసిన అప్సర బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. పంచనామా అనంతరం ఆ రిపోర్టు బయటికి వస్తే కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఆమె హత్యకు గల కారణాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘పూజారి సాయిక్రిష్ణకు అప్సరకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. గతంలో ఓసారి అతని వల్ల ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత అబార్షన్ కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి పెళ్లిపై అప్సర మరింత పట్టుబట్టగా, ఆమె సమస్యను తొలగించుకోవడానికి అమ్మాయిని అంతం చేయాలని నిందితుడు భావించాడ’’ ని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు అబార్షన్ అయినప్పుడు దానికి నువ్వే కారణమని అంబాండాలు వేసినట్లుగా సాయిక్రిష్ణ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతరులతో చనువుగా ఉండడం కూడా తాను హత్య చేసేందుకు ఓ కారణమని నిందితుడు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.
హతురాలు అప్సర తల్లి వాదన మరోలా..
అప్సర గర్భం దాల్చిందని నిందితుడు సాయిక్రిష్ణ పోలీసులకు చెబితే, అసలు తన కుమార్తెకు గర్భమే రాలేదని హతురాలి తల్లి తేల్చి చెబుతోంది. ఆమెకు ఏనాడూ పీరియడ్స్ ఆగలేదని చెప్పింది. ఏ విషయం జరిగినా మా పాప నాకు చెప్పేది. బ్రాహ్మణ జన్మకే అనర్హుడు. మా ఇంటికి తరచూ వచ్చి చక్కగా మాట్లాడేవాడు. ఇద్దరి మధ్య ఏమైనా జరిగి ఉంటే మా ఇంటికి వచ్చి ధైర్యంగా ఎలా ఉండగలిగాడు’’ అని అప్సర తల్లి వాపోయారు.
‘‘మా అమ్మాయికి గుడిలోనే సాయికృష్ణ పరిచయం అయ్యాడు. మా ఇంటికి వచ్చేవాడు. నన్ను అక్కయ్యా అని పిలిచేవాడు. మా అయన కాశీలో ఉంటారు. సాయికృష్ణ తరచూ ఇంటికి వచ్చి కలుపుగోలుగా ఉండేవాడు. 20 ఏళ్ల క్రితం మేం చెన్నై లో ఉండేవాళ్ళం. అప్పట్లో అప్సర సినిమాల్లో నటించింది. సాయిక్రిష్ణ కుటుంబంతో మాకు ఎలాంటి బంధుత్వం లేదు. ఆదివారం సాయి మా ఇంటికి మరోసారి వచ్చాడు. అప్సరను భద్రాచలం పంపించామని నాతో చెప్పాడు. నాతో కోయంబత్తూరు వెళ్తున్నట్లు అప్సర చెప్పింది. పాప కనపడట్లేదు అని అడిగితే.. నన్నే అనుమానిస్తున్నారా అని అన్నాడు. అలాంటిది ఏమీ లేదని చెప్పాడు. పూజారి అయ్యుండి ఇలా చేస్తాడని ఊహించలేదు. పెళ్లి చేసుకోవాలని మా కూతురు ఒత్తిడి చేసిందన్నది పచ్చి అబద్ధం’’ అని అప్సర తల్లి మీడియాతో అన్నారు.