ఇటీవల విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రిపబ్లిక్’ సినిమాపై రాజకీయ వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ హీరోహీరోయిన్లుగా దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబ‌ర్ 1న విడుద‌లై.. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ‘రిప‌బ్లిక్’ సినిమాను హైద‌రాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పాప్ సింగ‌ర్ స్మిత చూశారు. సినిమా అనంతరం రేవంత్ రెడ్డి, సీతక్క మీడియాతో మాట్లాడారు.


రిపబ్లిక్ సినిమా తీసిన దర్శకుడు దేవ కట్టాను రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ప్రస్థానం సినిమాను రేవంత్ గుర్తు చేశారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు ప్రస్థానం చూశానని, వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఆ సినిమా తీశారని దేవ కట్టాను ప్రశంసించారు. ‘‘దేవ కట్టా ఓ మంచి సినిమా తీశారు. చాలా సినిమాలు శుభం కార్డు పడ్డాక ఏదో ఒక ముగింపు అభిప్రాయంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. కానీ మేం మాత్రం వంద ప్రశ్నలు, ఆలోచనలతో బయటకు వచ్చాం. జరిగిన దానికంటే చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజాస్వామ్యం మెచ్యూర్ అవ్వాలంటే చేస్తున్న పనుల్లోని లోపాలను సరి దిద్దుకోవాలి. మంచి పాలన అందించేందుకు సరైన నిర్ణయాలను తీసుకోవాలి.’’


Also Read:  రసవత్తరంగా హుజూరాబాద్ ఉపఎన్నిక... అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థి ఎవరంటే..?


‘‘రిపబ్లిక్ సినిమాలో ఒక  ప్రాంతంలోని సమస్యను మాత్రమే చూపించి.. మొత్తం వ్యవస్థను నిలదీశారు. దేవ కట్టా సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. సినిమా అనేది నిర్మాతలకు నష్టమో లాభమో అనే కోణంలో లేదు. కానీ, ప్రజలకు ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుంది. కొద్ది మందిలోనైనా మార్పు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. దీన్ని యువత చూడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశం మనకు ఏం ఇచ్చిందనే కంటే.. మనం ఏం చేశామనే ఆలోచనను రేకెత్తించారు.’’ అని రేవంత్ అన్నారు. మన దేశానికి, మన ప్రాంతానికి ఏదైనా ఒక మంచి పని చేయాలని.. సినిమాను హీరో హీరోయిన్లు బాగా చేశారు అని చూడటం కంటే.. ఇంకా ఎక్కువ స్థాయిలో సినిమాను చూడాలని అన్నారు. జగపతి బాబు అద్భుతంగా నటించారని కొనియాడారు.


Also Read: దసరాకి ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు.. ప్రత్యేక వడ్డన, ప్రత్యేక సర్వీసులు అంటున్న ప్రభుత్వాలు


ఎమ్మెల్యే సీతక్క రిపబ్లిక్ చిత్రం గురించి స్పందిస్తూ.. తాను ఇలా సినిమాకు రావడం ఇదే తొలిసారని అన్నారు. ఈ సినిమా చూసిన తరువాత గుండె బరువెక్కిందని.. తనకు ఓ చరిత్ర, ఘటన గుర్తుకు వస్తుందని చెప్పారు. బ్రిటీష్ పరిపాలన‌కు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీని.. ఓ గాడ్సే రూపంలో చంపేస్తే.. అలానే ఓ అధికారి ప్రజల బాధలను తొలగిస్తే.. వారే మళ్లీ తిరిగి అధికారిని చంపడం వంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు, తమ లాంటి పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు సినిమాను చూసి ఎంతో మార్పు కోరుకుంటామని అన్నారు.


Also Read: TSRTC: మీరు సిటీ బస్ ఎక్కుతారా? అయితే గుడ్‌న్యూస్.. మీకు డబ్బు ఆదా.. సంస్థకు లాభం!






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి