దసరా పండుగ దగ్గరపడింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణికుల సందండి మొదలవబోతోంది. ఈ దసరా రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్ ట్రావెల్స్ అప్పుడే సిద్ధమయ్యాయి. ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఛార్జీలను అదనంగా పెంచాయి. ఏసీ స్లీపర్, సీటర్ సర్వీసుల్లో టిక్కెట్‌పై రూ.300-400 వరకు అదనంగా పెంచాయి. నాన్ ఏసీ సీటర్, స్లీపర్ సర్వీసుల్లో టిక్కెట్ ధర రూ.200 వరకు పెరిగింది. తక్కువ సర్వీసులే అందుబాటులో ఉన్నాయని.. రద్దీ పెరిగితే ఇంకా ధర పెరుగుతుందని ముందుగానే అలర్ట్ అవుతున్నారు ప్రయాణికులు. మరో రెండు రోజులు ఆలస్యం చేస్తే డబుల్ రేట్లు ఇచ్చుకోవాల్సి వస్తుందని దానికన్నా ఓ మూడొందలు ఎక్కువైనా ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో బుక్ చేసేస్తున్నారు.
చాలా దూరం నుంచి వెళ్లే ప్రయాణికులపై బాదుడు అంటే సరేకానీ చివరకు దగ్గర ఊర్లకు వెళ్లేవాళ్లకీ తప్పడం లేదు. విజయవాడ నుంచి విశాఖకు ఆర్టీసీ ఏసీ స్లీపర్‌లో టికెట్ ధర రూ.880, సీటర్ రూ.580, నాన్ ఏసీ సూపర్‌లగ్జరీలో రూ.504 ఉంది. అదే ప్రైవేటు ట్రావెల్స్‌లో ఏసీ స్లీపర్ రూ.1200- 1300, ఏసీ సీటర్‌లో రూ.900-1000 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ఇదే విధంగా ఛార్జీలను పెంచారు. ఇక రాయలసీమ జిల్లాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లోనూ ధరలను భారీగా పెంచేశారు. విజయవాడ - బెంగళూరు ఏసీ స్లీపర్ సర్వీసుల్లో రూ.1800-2000 చెబుతున్నారు. అదే ఆర్టీసీ వెన్నెల ఏసీ స్లీపర్ సర్వీసులో రూ.1,600 ధర ఉంది.
ప్రత్యేక సర్వీసులు: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 400వరకు అదనంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దూర ప్రాంత సర్వీసులతోపాటు వివిధ జిల్లాల మధ్య అదనపు సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మరోవైపు దసరా , బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ సమయత్తమవుతోంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్నిప్రాంతాలతోపాటు, ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని నడపనున్నారు. అదనపు చార్జీలతో 4035 ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అక్టోబర్ 8 నుంచి 14 వరకు స్పెషల్ సర్వీసులు తిరుగుతాయని ఆర్టీసీ ఉన్నతాధికారి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి 3,085 బస్సులు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల ముఖ్య పట్టణాలకు మరో 950 స్పెషల్ సర్వీసులను నడపనున్నారు.
Also Read: ఈ రోజు ఈ రాశులు వారు విజయం సాధిస్తారు, వారు అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు..ఏ రాశివారికి ఎలా ఉందంటే..
Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా లీక్.. బడాబాబుల ‘విదేశీ’ గుట్టురట్టు.. భారతీయ ప్రముఖులు కూడా!
Also Read: తెలంగాణలో ఉక్కపోత.. ఏపీలో మరో ఐదు రోజులు పిడుగులు పడే అవకాశం
Also Read: నాలుగో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు, ఈ రోజు రెండు బిల్లులపై చర్చ