ఏపీ తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే.. గులాబ్ తుపాను కారణంగా చాలా మంది నష్టపోయారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా.. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే పడుతున్నాయి. గులాబ్ తుపాను ముప్పు తప్పడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలంగాణలో వర్షాలు తగ్గి ఉక్కపోత పెరుగుతోంది. రెండు మూడు రోజులుగా వాతావరణంలో తేమ వల్ల ఉక్కపోత పెరుగుతోందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకూ వాతావరణం ఇదే తరహా ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ నెల 15వ తేదీ తరవాత నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి వెళ్లిపోతాయని అంచనా. సోమవారం ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఏపీలో మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఐదు రోజులపాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే గులాబ్ తుపానుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాంధ్రలో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.