TPCC Candlelight Rally Supporting GenZ | హైదరాబాద్: జెన్ జీ పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని, తద్వారా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ యువత సాధించిన విజయమని, ఈ క్రెడిట్ కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన అమానుష లాఠీచార్జీని నిరసిస్తూ, జెన్-జీ (Gen-Z) విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ క్యాండిల్ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది యువతీ యువకులు తరలివచ్చారు.

Continues below advertisement

యువత పోరాటానికి ప్రధాని మోదీ తలవంచక తప్పలేదు

Continues below advertisement

ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ అక్రమాలపై జెన్-జీ యువత జరిపిన సుదీర్ఘ పోరాటమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ యువ విప్లవానికి తలవంచక తప్పలేదని, అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే సమస్య పూర్తవలేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విజయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోదని, ఇది పూర్తిగా భారత యువత సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.

21 ఏళ్లకే ప్రజాప్రతినిధి అయ్యేలా తీర్మానం చేసి పంపుతాం..

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్‌లో 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్‌లు కాగలిగినప్పుడు, చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు కూడా 21 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఈ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని, 30 శాతం ఉన్న జెన్-జీ యువతకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

దేశ భవిష్యత్తు యువతరమైన జెన్-జీ (Gen-Z) చేతిలోనే ఉందని, ఈ దేశం వారిదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జంతర్ మంతర్ నుంచి జెన్-జీ యువత పార్లమెంటు వరకు తమ గళాన్ని వినిపించేలా ఎదగాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. దీనివల్ల 21 ఏళ్లకే త్రివేండ్రం మేయర్‌గా ఓ యువతి బాధ్యతలు స్వీకరించగలిగారని తెలిపారు.

సివిల్ సర్వీసెస్ అర్హత వయస్సు 21 ఏళ్లు ఉన్నందున, తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి 21 ఏళ్లకు, మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య 22 ఏళ్లకు ఐఏఎస్ సాధించారని, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ 32 ఏళ్ల క్రితమే యువ వయస్సులో ఐపీఎస్ సాధించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్ల అర్హత ఉండగా.. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లకే, సింగపూర్‌లో 21 ఏళ్లకే పోటీ చేసే హక్కు ఉందని వివరించారు.