Revanth Reddy: గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు అక్కడే ఆందోళనలు చేస్తున్నారు. అయితే శనివారం కూడా రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చేసిరికి ఆలేరు నియోజకవర్గం తురకలపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. దీంతో ఆయన అక్కడే ఆగి అసలెందుకు నిరసన చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ వారిపై ఫైర్ అయ్యారు. ఆలేరు నియోజక వర్గంలో మొత్తం 8 ఉండగా.. అందులో ఏడింటిని ఆ నియోజకవర్గం ఇఛార్జీ బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చెప్పిన వాళ్లకే ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఒక్క మండలంలో మహిళకు పదవి ఇస్తే వ్యతిరేకించడం సరికాదని అన్నారు. 


మండల కమిటీ ప్రెసిడెంట్ ను వెంటనే సస్పెండ్ చేయండి


వెంటనే ఆందోళన విరమించకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడమని చెప్పారు. వారి వివరాలను వెంటనే సేకరించాలని గాంధీభవన్ ఇంఛార్జీ, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు ఆదేశించారు. తుర్కపల్లి మండల నేతలు వెంటనే ధర్నా ఆపేయాలని నియోజక వర్గ ఇంఛార్జీ బీర్ల ఐలయ్యకు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మొన్నటి వరకు మండల కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని... వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి సూచించారు. అంతేకాకుండా కమిటీల నియామకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డిలకు వినతి పత్రం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial