హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లోని సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇందులో కాల్పులు జరిపిన వ్యక్తి ఓ సీరియల్ నటుడు కావడంతో మరింత అలజడి రేగింది. దీనికి వివాహేతర సంబందమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 


ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ్‌ అనే వ్యక్తిని నటుడు మనోజ్‌ కాల్చారు. ఈ ఘటనలో సిద్ధార్థకు గాయాల కాలేదు కానీ హత్యాయత్నం చేశారనే కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


ఈ కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ్‌ భార్యతో యాక్టర్‌ మనోజ్‌కు  వివాహేతర సంబంధం ఉందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగి ఉంటాయని కూడా భావిస్తున్నారు. ఆ దిశగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


సిద్ధార్థ భార్య చాలా కాలం నుంచి మనోజ్‌తో కలిసి ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీళ్లిద్దరూ సెలబ్రిటీ రిసార్ట్‌లో ఉంటున్నారు. వీళ్లతోపాటు సిద్ధార్థ కలిగిన పిల్లలు కూడా ఉంటున్నారు. తన పిల్లలను చూసుకునేందుకు సిద్ధార్థ వస్తుంటాడు. 


శుక్రవారం తన పిల్లలను చూసేందుకు  సెలబ్రిటీ క్లబ్‌కు వచ్చాడు. తన పిల్లలను మనోజ్‌ కొడుతున్నారని చెప్పడంతోనే అక్కడకు వచ్చినట్టు సిద్ధార్థ్ చెబుతున్నాడు. అదే విషయంపై మనోజ్‌ను ప్రశ్నిస్తే గొడవ జరిగిందని సిద్ధార్థ్ పోలీసులకు చెప్పారు. 


తాను ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్‌ తన ఇంట్లో ఉన్న ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపినట్టు సిద్ధార్థ్ చెబుతున్నారు. 2019 నుంచి మనోజ్‌, సిద్ధార్థ భార్యతో కలిసి ఉంటున్నారు.  


కాల్పుల జరిపిన మనోజ్ సీరియల్ నటుడు. అతను కార్తీక దీపం, మౌనపోరాటం సీరియల్స్‌లో నటించాడు. కార్తీక దీపం సీరియల్‌ లో ప్రేమ్‌గా అందరికీ సుపరిచితమే.


సిద్ధార్థ వైజాగ్‌లో ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. మనోజ్‌కు ఓ సాప్ఠ్‌వేర్ కంపెనీ ఉందని అందులో సిద్ధార్థ భార్య గ్రంథి పార్టనర్‌గా ఉన్నారని చెబుతున్నారు. సిద్ధార్థ, గ్రంథి వైజాగ్‌లో ఉండేవారని... వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విభేదాాల కాారణంగా  భర్త నుంచి వేరుగా ఉంటున్నారు గ్రంథి. 


భర్త నుంచి విడిపోయిన తర్వాత గ్రంథి తన పిల్లలతో కలిసి హైదరాబాద్‌ చేరుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మనోజ్‌తో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందని అంటున్నారు. గ్రంథి తన పిల్లలతో కలిసి సెలబ్రిటీ రిసార్ట్‌లో ఉన్న 21 విల్లాలో మనోజ్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్టు పోలీసులు తేల్చారు. 


టెక్నికల్‌గా విడిపోయిన సిద్ధార్థ, గ్రంథికి న్యాయపరంగా ఇంకా విడాకులు తీసుకోలేదు. అందుకే తన పిల్లలను చూసేందుకు సిద్ధాార్థ్ తరచూ ఈ విల్లాకు వచ్చేవారట. అయితే తనను మనోజ్ కొట్టాడని ఈ మధ్య కుమారుడు సిద్ధార్థ్‌కు ఫిర్యాదు చేశాడు. అదే విషయంపై మనోజ్‌ను, గ్రంథిని అడగడానికి వచ్చినట్టు సిద్ధార్థ చెబుతున్నారు.  ఈ వాగ్వాదం జరుగుతున్న టైంలోనే కాల్పులు జరిగినట్టు చెబుతున్నారు. 


మనోజ్ కాల్పులు జరిపిన ఎయిర్ గన్ తన స్నేహితుడు ఇచ్చినట్టు చెబుతున్నారు. దానికి అసలు లైసెన్స్ ఉందా.. అది ఏ స్థాయి గన్‌ అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అది నిజంగా లైసెన్స్ తీసుకోవాల్సిన గన్‌ అయితే మాత్రం మనోజ్ మరింత చిక్కుల్లో పడ్డట్టే అంటున్నాయి పోలీసులు వర్గాలు