హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో "పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం" అనే నినాదంతో ఒక ఎగ్జిబిషన్‌ను నిర్వహించి, హైడ్రా బాధితుల సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
KCR హయాంలో ఎటు చూసినా కొత్త నిర్మాణాలు
హైదరాబాద్‌లో మూసీ నది కాలుష్యం, హైడ్రా పేరిట ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతల వల్ల ఎంతో మంది పేదలు బాధితులుగా మారారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చాంద్రాయణగుట్టలో ఒక స్కూల్‌ను కూడా కూలగొట్టారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా నిర్మాణాలు, అభివృద్ధి మాత్రమే కనిపించేవి. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వైట్ హౌస్‌ను తలదన్నే సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు బీఆర్ఎస్ హయాంలో నిర్మించామని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టరేట్‌లు, నీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, తెలంగాణ వ్యాప్తంగా కొత్త నిర్మాణాలు చేపట్టామని కేటీఆర్ గుర్తుచేశారు.
కాంగ్రెస్ కట్టడాలు కాదు.. కేవలం కూలగొట్టడాలేకాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, ఒక్క కొత్త కట్టడం కూడా లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది కేవలం కూలగొట్టడమేనని ధ్వజమెత్తారు. ఒక ఇంటి గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. అంతలోనే బుల్డోజర్ వచ్చి కూలగొట్టింది. ఒక గర్భిణిని పక్కకు తోస్తే ఎలా ఉంటుందో అంతా ఆలోచించాలి. మూడేళ్ల చిన్నారి భోజనం లేదని ఏడ్చిన పరిస్థితి. హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్ధం కావాలని కేటీఆర్ అన్నారు.
పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం..
హైడ్రాపై గతంలో భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారని, ఆ రోజు చాలా మంది పెద్ద బిల్డర్ల పేర్లు చెప్పినా.. తాము ఏ బిల్డర్‌ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని తెలిపారు. ఇప్పుడు పేదవాడి ఇంటికి బుల్డోజర్ వచ్చినప్పుడు, ఆ పెద్ద బిల్డర్ల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రూల్స్ అతిక్రమిస్తే కాపాడాలని తాము చెప్పట్లేదని, కానీ పేదలకు, పెద్దలకు ఒకే న్యాయం ఉండాలన్నారు. పేదలకు న్యాయం చేయాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా, టైమ్ ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని చెప్పి పేదలకు టైం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యమా అని కేటీఆర్ నిలదీశారు.
పెద్ద నాయకులను వదిలేశారుపెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం అన్న తీరును కేటీఆర్ ప్రశ్నించారు. ఫుల్ ట్యాంక్ లెవల్‌లో కడితే ఎవరినీ వదలం అని చెప్పి మంత్రులు, పెద్ద నాయకులను వదిలేశారని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టుకున్నారని, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తారా అని ప్రశ్నించారు. మరో మంత్రి వివేక్, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి వారు చెరువులు, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోపల ఇళ్లు కట్టుకున్నా వారి జోలికి వెళ్లలేదని, వారికి నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రాకు ఉందా అని కేటీఆర్ సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరితే ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం ఉంటుందా అని కేటీఆర్ నిలదీశారు.
మూసీ నదికి అడ్డంగా ఆకాశమంత పెద్దగా కట్టిన బిల్డింగ్‌ను కూడా ఇప్పటి వరకు ఆపలేదని, పెద్ద బిల్డర్లకు సహకరిస్తూ పేదలకు మాత్రం బుల్డోజర్లు పంపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. యూపీలో బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని రాహుల్ గాంధీ మాట్లాడారని, మరి తెలంగాణలో పేదల ఇళ్లు కూలగొడుతుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. కొండాపూర్‌లో ఇందిరమ్మ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి ఇచ్చిన ప్లాట్లను కూడా హైడ్రా వెళ్లగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా చేసేది న్యాయమే అయితే అర్థరాత్రి ఎందుకు వస్తున్నారు, నోటీసులు ఇవ్వడానికి, పేపర్లు చూడటానికి ఎందుకు ఇబ్బంది అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు, తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయండని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేస్తున్నారని విమర్శించారు. 500 రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చి బాధితులకు న్యాయం చేస్తుందని కేటీఆర్ అన్నారు.