Revanth Reddy on Malla Reddy: చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రసంగించారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిండు అని విమర్శించారు. 


జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం తరలించలేదన్నారు. కేసీఆర్, మల్లారెడ్డి తొడుదొంగల్లా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారని విమర్శించారు. మేడ్చల్ కు ఐటీ కంపెనీలు తెస్తామన్న హామీని తుంగలో తొక్కారు అని ఆరోపించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.


కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ.2,500 అందిస్తామన్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రూ.400గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12వేలు అందిస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.