ShivaBalakrishna Corruption Case: హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్​అయిన తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణ (ShivaBalakrishna) ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని శివ బాలకృష్ణ తరఫు లాయర్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు గుర్తించామని చెబుతున్నట్లుగా అభియోగాలలో పేర్కొన్నంత ఆదాయం, ఆస్తులు లేవని పిటీషన్‌లో పేర్కొన్నారు.


శివ బాలకృష్ణ (ShivaBalakrishna) అవినీతి వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ అథారిటీ (Hmda) డైరెక్టర్‌గా పని చేసిన శివ బాలకృష్ణ... 6 నెలల క్రితమే రెరాకు బదిలీపై వెళ్లారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ (Acb)సోదాలు నిర్వహించింది. వందల కోట్ల రూపాయలను ఆస్తులను గుర్తించిన ఏసీబీ... శివబాలకృష్ణను కొన్ని రోజుల కిందట అరెస్ట్ చేసింది. ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన భూముల వ్యవహారాలపై దృష్టి సారించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


గత వారం ఏసీబీ దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా వందల కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. హెచ్‌ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని తనకు అనుకూలంగా మలుచుకుని వందల దరఖాస్తులను ఆమోదించేందుకు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడని అభియోగాలు ఉన్నాయి. అతడి ఇంట్లో ఖరీదైన ఫోన్లు, వాచీలు, లగ్జరీ వస్తవులు కనిపించడం చూసి అధికారులు షాకయ్యారు.


అక్రమాలకు అడ్డాగా కార్యాలయం 
తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ... చ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ దళారి ఆయనకు కుడిభుజంగా వ్యవరించినట్లు తెలుస్తోంది. ఏ ఫైళ్ల మీద సంతకం పెట్టాలన్నా దళారి మాటే చెల్లుబాటు అయ్యేదని సమాచారం. హైదరాబాద్‌ శివారుకు చెందిన తన మిత్రుడిని, కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని బినామీలుగా మార్చుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వారి పేర్లతోనే   శివ బాలకృష్ణ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తేల్చారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వస్తుందనే తెలియగానే ఆగమేఘాల మీద  హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు పూర్తి చేసి...కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయ్యే సమయంలో ప్రధాన ఫైళ్లన్నీ తన వెంట తీసుకెళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ ఫైళ్లతోనే బేరసారాలు సాగించి... కోట్ల రూపాయలు వెనకేసున్నారని ఏసీబీ గుర్తించి కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది.