ఫైర్.. ఫైర్ ది ఫైర్ అన్న డైలాగ్ ఆవిడకి పక్కా సూటవుతుంది. శివంగి అని చాలామంది పిలిచినా ఫైర్ అనేదే ఆమె బ్రాండ్ గా మార్చుకుని రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ ఆఫ్ ది మ్యాటర్‌గా ఉంటారు. నిన్నగాక మొన్న ఏపీ మంత్రికే సవాల్ విసిరి ఎక్కడైనా..ఎవ్వరైనా సరే తగ్గేదేలే అని నిరూపించుకుంటారు. పరిచయం అక్కర్లేని ఆవిడ ఇప్పుడు మరోసారి పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా మారారు.
రేణుకా చౌదరి.. ఈ పేరు వినగానే ఫైర్ కనిపిస్తుంది. రాజకీయనేతలే కాదు సామాన్యులు కూడా ఆవిడని శివంగిగానే చూస్తారు. కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్ననాళ్లు..ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం విడిపోక ముందు రేణుకాచౌదరి వివిధ పదవుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో కేంద్రంలో మంత్రితోపాటు పలు పదవులను కూడా అందుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఓ వెలుగువెలిగారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఇటు రాష్ట్రం అటు కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో రేణుకా చౌదరి సైలెంట్ అయ్యారు. ఎక్కడా కూడా ఆవిడ పేరు వినిపించింది లేదు. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ రేణుకా హుషారయ్యారు.
ఇక నిన్నగాక మొన్న ఏపీ మాజీ మంత్రి కొడాలినానికి వార్నింగ్ ఇచ్చారు. నీ ఇలాఖాలోనే నీపైనే పోటీ చేసి గెలిచి చూపిస్తానంటూ సవాల్ విసిరారు. దీంతో రేణుకా చౌదరి వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇది కేవలం రాజకీయ సవాలే కానీ నిజం కాదన్న మరో టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా బోలెడన్ని సవాళ్లలో ఇదొకటని బుస్సుమనిపించారు. అయితే జూబ్లిహిల్స్ నుంచి ఈసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు ఎంపీగా మాత్రమే పోటీచేసిన రేణుకాచౌదరి ఈసారి రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట.
తన రాజకీయ జీవితం ప్రారంభమైన బంజారాహిల్స్ నుంచి అంటే ఇప్పుడు జూబ్లిహిల్స్ నియోజకవర్గంగా మారిన అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేణుకా చౌదరి పోటీచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. రేణుకా తన రాజకీయజీవితం ప్రారంభించిన్పటి నుంచి ఇక్కడే. ఇక్కడే కౌన్సిలర్ గా గెలిచారు. జూబ్లిహిల్స్ మాస్, క్లాస్ ఓట్లు మిక్స్ అయి ఉంటాయి. తన సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువే. ప్రముఖులంతా ఉండేది ఈ ప్రాంతమే. తనకు వ్యక్తిగత పరిచయాలు కూడా ఎక్కువే. సో జూబ్లిహిల్స్ అయితే బెటర్ అని రేణుకా భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.
అసలు ఆమె సొంత నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్.(ఆమె ఈ ప్రాంతం కాకపోయినా) నాలుగు ఐదుసార్లు పోటీచేస్తే రెండు సార్లు గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడే జనరల్ సీట్లు ఉన్నాయి. అవి పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు. మూడింటిలోనూ సాధ్యం కాదు. కాబట్టే రేణుకా ఖమ్మంను కాదని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆమె తన రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో రెండు సార్లే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1986, 1998 లో టీడీపీ నుంచి రాజ్యసభ మెంబర్ గా పనిచేసి దేవగౌడ క్యాబినెట్లో హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. 1998లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 1999, 2004లో ఖమ్మం పార్లమెంట్ నుంచి గెలిచి 2004 లో కేంద్రమంత్రి కూడా అయ్యారు. 2009లో నామా నాగేశ్వరావు చేతిలో ఓడిపోయారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజ్యసభ ఇచ్చింది.
గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కొడుకు విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసి టీఆర్ ఎస్ నేత మాగంటి గోపినాథ్ చేతిలో ఓడిపోయారు. విష్టుకు వరుస ఓటములు, నియోజకవర్గంపై పట్టులేకపోవడం, పార్టీలో యాక్టివ్గా తిరగపోవడం మైనస్ పాయింట్లు అయ్యాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో రేణుకాచౌదరి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. రేణుకాచౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవడం వెనక పెద్ద కారణం కూడా ఉందంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ధీటైన నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి మీద అసహనంతో ఉన్నవారు కూడా పార్టీలో ఎక్కువమందే ఉన్నారు. రేణుకా చౌదరి మీద ఒక్క సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తప్పించి మిగిలిన సీనియర్లు, జూనియర్లకు వ్యతిరేకతలేదు. అంతేకాదు పార్టీలోని మహిళా విభాగం కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఒకప్పుడు డికే అరుణ, గల్లా అరుణ, సబిత, సునితారెడ్డి, విజయశాంతి వంటి నేతలతో కళకళలాడిన కాంగ్రెస్ లో ఇప్పుడు ఆపరిస్థితులు లేవు. అందుకే మళ్లీ కాంగ్రెస్ కి పూర్వవైభవం తెచ్చేందుకు , పార్టీ శ్రేణుల్లో ఊపు తెచ్చేందుకు రేణుకా లాంటి ఫైర్ లీడర్ కావాలని అధిష్టానం కూడా భావిస్తోందట. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాణి ని బలంగా వినిపించేందుకు రేణుకానే కరెక్ట్ అంటున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాలపై రేణుకా కన్నేశారని ఇన్ సైడ్ న్యూస్.