Medical Seats Reservations : వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌, బీడీఎస్-బీ కేట‌గిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం  తెలంగాణ విద్యార్థుల‌కు కేటాయించేలా నిబంధనలు సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జీవో నెంబర్ 129, 130లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 1068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. 


బీ-కేటగిరీ సీట్లలో 


తెలంగాణలోని 20 నాన్ మైనారిటీ, 4 నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3200 సీట్లు ఉండగా వీటిల్లో బీ-కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. ప్రభుత్వం ఈ నిబంధనలు సవరించింది. బీ-కేటగిరీలోని 35% సీట్లలో 85% సీట్లు అంటే 952 సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించింది. మిగతా 15 శాతం అంటే 168 సీట్లు ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంది.  మైనారిటీ కాలేజీల్లో 25 శాతం బీ-కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా జీవోలతో 85 శాతం అంటే 116 సీట్లు స్థానిక విద్యార్థులకు దక్కుతాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మేనేజ్ మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీ-కేటగిరీలోని 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా స్థానిక కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందుతున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, ఈ విషయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసింది.  


స్థానిక విద్యార్థులకు మరో వెయ్యి సీట్లు 


మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్, గుజరాత్, కేరళ, ఒడిశా, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానం అమల్లో లేదు. ఇటీవల మెడికల్ సీట్లను ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో  కొన్ని రాష్ట్రాలు మార్పులు చేశాయి. సొంత రాష్ట్రంలో రిజర్వేషన్ పొందని విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోనూ అవకాశం తీవ్రంగా నష్ట పోతున్నారు. దీనిపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక విద్యార్థులకు లాభం చేకూర్చేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 1068 మంది విద్యార్థులు సీట్లు పొందనున్నారు. ఎంబీబీఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలతో సహా ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే వైద్య విద్య చదివేందుకు అవకాశం కలుగుతుంది. రాష్ట్రంలోని ఒక్కొ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.