Kondapur News : హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లీఫ్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఆరునెలల గర్భిణీకి  వైద్యం అందించడంలో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ప్రసూతి వైద్యురాలికి బదులుగా నర్సు వైద్యం అందించింది. మహిళకు నొప్పులు పెరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆస్పత్రి బాత్ రూమ్ లో శిశువుకు జన్మనిచ్చింది తల్లి. పుట్టిన పది నిమిషాలకే శిశువు మృతి చెందింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది విషయం బయటకు హడావిడిగా పసికందు మృతదేహాన్ని కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్ స్మశాన వాటిక తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రెండు రోజుల తర్వాత  విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.  శిశువు మృతదేహం వెలికితీసేందుకు కొండాపూర్ పోలీసులు స్మశాన వాటికకు చేరుకున్నారు. పోలీసుల రాకతో స్మశానవాటిక వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. 


ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు 


నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్‌లు లేని ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహించింది. అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు, అర్హత లేకుండా అక్రమంగా నిర్వహిస్తోన్న ప్రైవేటు ఆసుత్రులపై నాలుగు రోజులుగా వైద్య ఆరోగ్యశాఖ దాడులు నిర్వహిస్తోంది. తనిఖీలు చేపట్టిన వైద్యశాఖ అధికారులు ఏకంగా 81 ఆసుపత్రులను సీజ్‌ చేసింది. మరో 64 ఆసుపత్రులకు భారీగా జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1569 ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు 416 హాస్పిటల్స్‌కు నోటీసులు జారీచేశారు.  నోటీసులు ఇచ్చిన ఆసుపత్రులు రెండు వారాల్లో స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని డీహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అల్లోపతి పరిధిలోకి రాని ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. కొందురు డీఎమ్హెచ్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు కూడా వచ్చాయని తెలిపారు. దీంతో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. లైసెన్స్‌ జారీ చేసేందుకు ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.  ఆర్ఎంపీలు, పీఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   


ఆదిలాబాద్ జిల్లాలో తనిఖీలు 


ఆదిలాబాద్ జిల్లాలో వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రులలో మౌళిక సదుపాయాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆసుపత్రులకు నోటీసులు అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను గురువారం జిల్లా వైద్యాధికారి డా. రాథోడ్ నరేందర్ తనిఖీ చేశారు. ఆసుపత్రులకు సంబంధించిన పలు ఫైళ్లను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఇప్పటివరకు 46 ప్రైవేట్ నర్సింగ్ హోంలను తనిఖీ చేశామని, 26 నర్సింగ్ హోంలకు నోటీసులు ఇచ్చామన్నారు. రెండు వారాలలో నోటీసులకు సమాధానం చెప్పకపోతే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


Also Read : Medical Seats : వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, బీ-కేటగిరి సీట్లలో 85 శాతం స్థానికులకే!


Also Read : World Heart Day 2022: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహణ!