Gachibowli Car Accident Updates: హైదరాబాద్, గచ్చిబౌలిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, మరో వ్యక్తి చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధు స్పందించాడు. ప్రమాదానికి ముందురోజు రాత్రి నుంచి ఏం జరిగిందో వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిద్ధు ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడాడు. శుక్రవారం రాత్రి జూనియర్ ఆర్టిస్టులు ఎన్.మానస(23), ఎం.మానస(21), అబ్దుల్ రహీమ్ మద్యం సేవించి ఉన్నారని షాకింగ్ విషయాలు తెలిపాడు.
నిన్న రాత్రి ముగ్గురు తన రూముకు వచ్చారని.. మద్యం సేవిద్దామని అడగగా తాను నిరాకరించినట్లు జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు వెల్లడించాడు. ఎం మానస, ఎన్ మానస, రహీమ్ కలిసి మద్యం సేవించారు. అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు వెళ్దామన్నారు. తెల్లవారుజామున టీ తాగేందుకు కారులో బయటకు వెళ్లాము. అయితే మద్యం సేవించి ఉన్నారు కదా బయటకు వెళ్లవద్దు అని వాళ్లను వారించాను కానీ వాళ్లు నా మాట వినలేదు. వారితో పాటు నన్ను కూడా కారులో తీసుకెళ్లారు.
గచ్చిబౌలి హెచ్‌సీయూ డిపో వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు సిద్ధు తెలిపాడు. వేగంగా నడపడం వల్లే కారు అదుపుతప్పిందని, ప్రమాదంలో కారులో తనతో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు. చనిపోయిన వారితో పాటు తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా.. మిగతా ముగ్గురు మద్యం సేవించినట్లు తేలగా.. తనకు మాత్రం జీరో వచ్చినట్లు స్పష్టం చేశాడు. ప్రమాదంలో కారు రెండు ముక్కలు కావడం ప్రమాదం తీవ్రతను సూచిస్తుంది.
చనిపోయిన ముగ్గురిలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ మానస కర్ణాటకకు చెందిన అమ్మాయి కాగా, మరో మానస మహబూబ్ నగర్ జిల్లా వాసి. రహీమ్ ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తి. మానసలు జూనియర్ ఆర్టిస్టులు కాగా, రహీమ్ బ్యాంకు ఉద్యోగి. వీరంతా తరచుగా కలుసుకుని పార్టీలు చేసుకునే వారని తెలుస్తోంది. కానీ మద్యం మత్తులో వాహనాన్ని నడపడం ప్రమాదానికి దారితీసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read: Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి
Also Read: Vijayawada Crime: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు