Rangareddy BDS Student Kidnap Case: నవీన్ రెడ్డిని తాను ప్రేమించలేదని, ఫ్రెండ్ మాత్రమేనని.. అతడితో తనకు పెళ్లి కాలేదని ఆదిభట్లలో కిడ్నాప్ అయిన యువతి (బీడీఎస్ స్టూడెంట్) సంచలన విషయాలు వెల్లడించింది. చిన్నప్పటినుంచీ తన తల్లిదండ్రులు తనను కొట్టలేదని, కానీ నవీన్ రెడ్డి కొందరు యువకులతో తమ ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, ఆపై వాహనంలో దారుణంగా కొట్టారని తెలిపింది. శనివారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన బాధిత యువతి.. తన కెరీర్ ఇక్కడితో ఆగిపోతుందని, కేసును దర్యాప్తు చేసి నిజాలు రాబట్టాలని పోలీసులను కోరారు. తాను చెప్పినట్లు వినకపోతే మా నాన్నను చంపేస్తామని బెదిరించారని బీడీఎస్ స్టూడెంట్ చెప్పింది.
కారులో హింసించాడు !
తనను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లాక.. జుట్టు పట్టి కొట్టాడని, మెడపై దాడి చేసి గాయపరిచాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మెడ మెలి తిప్పి హింసించాడని, కాళ్లు కూడా మెలితిప్పి తీవ్రంగా హింసించారని కిడ్నాపర్ల చెర నుంచి బయటడపడ్డ యువతి తెలిపింది. తాను ప్రేమించకపోయినా సరే, నవీన్ రెడ్డి ప్రేమించినందుకు అతడ్ని వివాహం చేసుకోవాలని, కలిసుండాలంటూ వేధించాడని చెప్పింది. తనకు ఇష్టం లేకున్నా సరే అతడితోనే కలిసుండాలని డిమాండ్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి కిడ్నాప్ చేశారన్నారు. ప్రాణ భయం ఉందని, పోలీసులతో తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది. పెళ్లి కాకున్నా వివాహం జరిగిందని నవీన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని తన కెరీర్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
పరిచయం ఉంది, కానీ ప్రేమించలేదు!
నిందితుడు నవీన్ రెడ్డితో తనకు పరిచయం ఉందని, కానీ అతడ్ని ప్రేమించలేదని.. తమకు పెళ్లి అయిందన్న వార్తల్లో నిజం లేదని బాధితురాలు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి జరిగిందని నవీన్ రెడ్డి చెప్పిన రోజు తాను డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పింది. తాను ఒంటరిగా నవీన్ రెడ్డితో ఎప్పుడూ వెళ్లలేదని, తన కుటుంబంతో పాటు కొన్నిసార్లు టూర్లకు వెళ్లినట్లు తెలిపింది. తన కుమారుడ్ని కాపాడుకునేందుకు నవీన్ రెడ్డి తల్లి సైతం ఆరోపణలు చేసినట్లు బాధితురాలు అన్నారు. నీ లైఫ్ నువ్వు చూసుకో, మా లైఫ్ మేం చూసుకుంటాం అని చెప్పినా నవీన్ రెడ్డి వినలేదని, ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. నవీన్ రెడ్డి చెప్పిన విషయాలకు, బాధిత యువతి వెల్లడించిన విషయాలకు పొంతన కుదరడం లేదు. యువతి స్టేట్‌మెంట్ ను పోలీసులు ఇదివరకే వీడియో రికార్డింగ్ చేశారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన యువతి తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది.
3 నెలల కిందటే పీఎస్‌లో ఫిర్యాదు..
నవీన్ రెడ్డి తనను వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాను కానీ పొలీసులు పట్టించుకోలేదని బీడీఎస్ స్టూడెంట్ వెల్లడించింది. పోలీస్ లు కనుక అప్పుడే అతడిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. నేను మేజర్‌ను. నేను కూడా ఇష్టపడితే కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళిచేసుకునే దాన్ని. నేను ఎలాంటి పేపర్ల పై సంతకాలు పెట్టలేదు. కారు, ఇన్సూరెన్సులపై నామినీగా నా పేరు ఇచ్చాడు. కానీ నేను ఎలాంటి పేపర్లపై సంతకాలు చేయలేదు. కానీ మా కుటుంబ సభ్యులతో కలిసి నవీన్ రెడ్డితో యాత్రకు వెళ్లామని చెప్పింది బాధితురాలు.
కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్ట్
ఆదిభట్ల పీఎస్ పరిధిలోని మన్నెగూడలో జరిగిన యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు దాడి చేసిన సమయంలో వినియోగించిన రెండు వాహనాలను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సరూర్‌నగర్ లో స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనంలో పోలీసులకు సీసీ కెమెరాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేశారు. యువతి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా 32 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.