Adibatla Kidnap Case : హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సంచలనం అయింది. వంద మంది యువకులు యువతి ఇంటిపై దాడికి పాల్పడి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అనంతరం యువతిని కిడ్నాప్ చేశారు. శుక్రవారం సాయంత్రం యువతి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. నవీన్ రెడ్డితో పాటు మరికొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కిడ్నాప్ కు వాడిన రెండు వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎల్బీనగర్ ఎస్ఓటి కార్యాలయం నుంచి వైశాలి కిడ్నాప్ కేసు నిందితులను ఆదిభట్ల పీఎస్ కు పోలీసులు తరలించారు. రెండు వాహనాల్లో సుమారు ఇరవై మంది నిందితులను ఆదిభట్ల పీఎస్ కు తీసుకువచ్చారు. ఆదిభట్ల పీఎస్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించనున్నారు. దాడికి ఉపయోగించిన రెండు వాహనాల్లోనే నిందితులను పోలీసులు తరలించారు. 


రిమాండ్ కు నిందితులు 


ఆదిభట్ల పీఎస్ పరిధిలోని మన్నెగూడలో జరిగిన యువతి కిడ్నాప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు దాడి చేసిన సమయంలో వినియోగించిన రెండు వాహనాలను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సరూర్‌నగర్‌ లో స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనంలో పోలీసులకు సీసీ కెమెరాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేశారు. యువతి కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్‌ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 


దాడికి ముందు మద్యం పార్టీ 


రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో యువతి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. యువతి కిడ్నాప్ ను అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే దాడికి ముందు నిందితుడు నవీన్ రెడ్డి మందు పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. యువతి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్ రెడ్డి తన వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ఆఫీస్‌కు పిలిపించుకుని పార్టీ పేరుతో అక్కడ మద్యం ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో ఉన్న వాళ్లందరినీ రెండు వాహనాల్లో నవీన్‌రెడ్డి యువతి ఇంటికి తీసుకెళ్లాడు. యువతి ఇంటిపై దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన అనుచరులను యువతి ఇంటికి తీసుకెళ్లి దాడి చేయించినట్లు భావిస్తున్నారు. యువతిని కిడ్నాప్ చేసిన నిందితులంతా వివిధ మార్గాల్లో పారిపోయారని పోలీసులు తెలిపారు. 


ఇంటిపై దాడి తప్పే కానీ 


ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ కూడా ఆందోళనలో ఉన్నారు. దాడి సంఘటన గురించి తెలిసినప్పటి నుంచి ఆమె ఆహారం తీసుకోవడం లేదు. అయితే నారాయణమ్మ వాదన మరోలా ఉంది. తన కుమారుడు ఎంతో కష్టపడి ఓ స్థాయికి చేరుకున్నాడన్నారు. తన కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా స్నేహంగా ఉన్నారన్నారు. ఆ యువతి చాలాసార్లు తమ ఇంటికి వచ్చిందన్నారు. కరోనా టైంలో యువతిని నవీన్ రెడ్డి కళాశాల వద్ద దింపేవాడన్నారు. యువతిని పెళ్లి చేసుకున్నట్లు నవీన్ రెడ్డి చెప్పాడన్నారు. తమ కుమారుడు తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా యువతి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడన్నారు. యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే కానీ ముందు జరిగిన విషయాలను కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలని నారాయణమ్మ కోరుతున్నారు.