Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6న హైదరాబాద్‌లో లేదా దిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ కవితను కోరింది. ఈ నోటీసుల ప్రకారం 6వ తేదీన ఆమెను విచారించేందుకు దిల్లీ నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చారు. కానీ పలు కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నానని కవిత తెలిపారు. అయితే సీబీఐ అధికారులు 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా రావొచ్చని కవిత తెలిపారు. సీబీఐ అధికారులు ఎమ్మెల్సీని విచారించేందుకు రేపు మరోసారి హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. విచారణకు ముందు తనకు కేసు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ ఇవ్వాలని సీబీఐ అధికారులకు గతంలో ఆమె లేఖ కూడా రాశారు.  






కవిత ఇంటికి సీబీఐ అధికారులు


హైదరాబాద్ లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు లిక్కర్ స్కామ్ లో ఆమె వివరణ తీసుకోనున్నారు. అయితే ఈనెల 6వ తేదీనే కవితను సీబీఐ విచారించాల్సి ఉంది. కానీ డిసెంబర్ 5న కవిత సీబీఐ అధికారికి లేఖరాశారు. ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారం 6న విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. ఈనెల 11,12,14,15 తేదీల్లో ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని లేఖలో కవిత పేర్కొన్నారు. దీంతో సీబీఐ అధికారులు 11వ తేదీన వివరణ తీసుకుంటామన్నారు. దీంతో రేపు హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు వివరణ కోరనున్నారు. దిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అనంతరం సీబీఐ అధికారులు ఈ కేసులో కవితను వివరణ కోరారు.  


కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు 


రేపు హైదరాబాద్ లోని కవిత ఇంటికి సీబీఐ అధికారులు రాబోతున్న తరుణంలో ఆమె ఇంటి వద్ద భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. కవిత మద్దతుదారులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  డాటర్ ఆఫ్ ఫైటర్, విల్ నెవర్ ఫియర్, వీ ఆర్ విత్ కవితక్క అంటూ ఫ్లెక్సీల పెట్టారు. కవిత వివరణ తీసుకునే సందర్భంలో సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. వాటికి కవిత ఏ విధమైన సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కవిత స్టేట్ మెంట్ రికార్డు చేసిన అనంతరం సీబీఐ అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచిచూడాలి.