Ram Gopal Varma Tweet On V Hanmanth Rao:పేడపై రాయి వేస్తే అది మనపైనే చిందుతుందనేది పాతకాలపు సామెత. అలాగే, ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతుండే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పెట్టుకుంటే కూడా మనకే నష్టం జరుగుతుందని చాలా మంది అంటారు. అది నిజం చేసేలా రామ్ గోపాల్ వర్మపైన విమర్శలు చేసిన వారు ఎవరైనా సరే, ఆయన వారిపై సెటైరికల్ ట్వీట్లు చేసిన ఘటనలు గతంలో లెక్కకు మించి ఉన్నాయి. తాజాగా అలాంటి ఇంకో పరిణామం జరిగింది. ఈసారి రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు పెట్టుకున్నారు. దీనికి బదులుగా ఆయన దిమ్మ తిరిగే సమాధానాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విటర్ ద్వారా ఇచ్చారు.


రామ్ గోపాల్‌ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని వీ హనుమంతరావు డిమాండ్‌ చేస్తూ శనివారం (మార్చి 18) ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్‌ వర్మ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సరికాదని అన్నారు. ఇప్పటివరకు దీనిపై సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన లేదని.. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అవుతుందని చెప్పారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయండని వీహెచ్ సవాలు విసిరారు. నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేసి, వర్మ మీద చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని వీహెచ్‌ హెచ్చరించారు. ఓ కార్యక్రమంలో వీహెచ్ మాట్లాడుతూ.. టాడా యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.


దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాత గారూ మీరింకా ఉన్నారా అంటూ ట్వీట్ చేశారు. మీ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆ గతి పట్టిందని ఎద్దేవా చేశారు. వీహెచ్ మాట్లాడిన ఓ వీడియో లింక్ ను ప్రస్తావిస్తూ.. ‘‘NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి’’ అంటూ ట్వీట్ చేశారు.






రామ్ గోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు, మహిళా సంఘాలు ఆర్జీవీపై విరుచుకుపడ్డాయి. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.