సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలని చెప్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తోన్న ఆరుగురు యువతీయువకులు మరణించడంపై సజ్జనర్ స్పందించారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమన్నారు సజ్జనార్. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తామని అని సజ్జనర్ పేర్కొన్నారు.
భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తున్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందన్నారు వీసీ సజ్జనార్. క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్ MLM దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.లక్షన్నర నుంచి 3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత క్యూనెట్ పై అనేక కేసులు నమోదు చేసిన, ఈడీ ఆస్తులను జప్తు చేసినా దానితీరు మారడం లేదన్నారు.
యువతీ యువకులు అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడొద్దని పిలుపునిచ్చారు . బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండని సూచించారు. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండండని అని వీసీ సజ్జనర్ సూచించారు.
మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఆ సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒక్కటికి ఒక్కటికి రెండు సార్లు నిర్ధారించుకుని అద్దెకివ్వాలని సూచించారు. అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని సజ్జనర్ హితవు పలికారు.
స్వప్నలోక్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనతో క్యూనెట్ దందా బయటపడింది. అరచేతిలో వైకుంఠం చూపించి యువతను బుట్టలో వేసుకున్నదే గాక, వారి జీవితాలను బుగ్గిచేసింది మాయదారి మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ. అగ్నికీలలకు ఆహుతైనవాళ్లంతా క్యూనెట్‌లో పనిచేసే యువతీయువకులే. పైకి కాల్ సెంటర్ అని చెప్పుకున్నా, తెరవెనుక క్యూనెట్ పేరుతో MLM దందా నడిపిస్తున్నారు. గత కొంతకాలంగా క్యూనెట్ అక్రమాలపై తీవ్రమైన ఆరోపణలున్నా, బెరుకులేకుండా ఏదో మూలన దందా కొనసాగిస్తున్నారని మరోసారి స్వప్నలోక్ ఘటన ద్వారా బయటపడింది.
మొత్తం 40మందికి పైగా క్యూ నెట్ సంస్థలో పనిచేస్తున్నట్టు సమాచారం. చనిపోయినవాళ్లు మాత్రం టీం లీడర్లని తెలిసింది. ప్రమాదానికి ముందే మిగతా వాళ్లు వెళ్లిపోయారని చెబుతున్నారు. మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిన వారంతా గత రెండు మూడేళ్లుగా క్యూనెట్‌లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. లక్షలకు లక్షలు వారి దగ్గర్నుంచి తీసుకున్న సంస్థ.. కొంతకాలంగా జీతాలేమీ ఇవ్వకుండా సతాయిస్తోందని చాలామంది వాపోయారు.