West Rayalaseema MLC :  పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు.  కడప - అనంతపురము - కర్నూలు నియోజకవర్గాల పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కువినియోగించుకున్నారు.    భూమిరెడ్డి రామగోపాల్ రెడ్ వైఎస్ఆర్‌సీపీ వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల తేడాతో  విజయం సాధించారు. దీంతో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించినట్లయింది. 


వైసీపీకి పెట్టని కోట లాంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పట్టభద్రులు కూడా తెలుగుదశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు.  గత ఎమ్మెల్సీఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాజీ ఉద్యోగ సంఘం నేత వెన్నుపూస గోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి ఆయనకు బదులుగా ఆయన కుమారుడు  రవీంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఈ స్థానంలో విజయం సాధించింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఓటమి పాలు కావడం ఆ పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతోంది. 


తొలి ప్రాధాన్య ఓట్లలో విజయానికి కావాల్సిన యాభై శాతం ఓట్లు ఎవరికీ రాలేదు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి  వెన్నుపూస రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.  ద్వితీయ ప్రాధాన్యం ఓట్లలో తెలుగుదశం పార్టీ అభ్యర్థిగా ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఎన్నికలకు ముందే  పీడీఎఫ్ నేతలు తమ ద్వితీయ ప్రాధాన్య ఓటు తెలుగుదశం పార్టీకి వేసేలా ఒప్పందం చేసుకున్నారు.  ఈ కారణంగా భారీగా ద్వితీయ ప్రాధాన్య ఓట్లు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చాయి. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు పులివెందులలో కూడా  పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 


కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. కొన్ని ఓట్ల  బండిల్స్  టీడీపీకి వేశారని ఆరోపించారు. రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. పలుమార్లు కౌంటింగ్ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి పదే పదే వైసీపీ అభ్యర్థి  రవీంద్రారెడ్డి బయటకు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడి వచ్చారు. అయితే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు చాలా ఎక్కువగా టీడీపీకి రావడం.. మెజార్టీ ఏడు వేలు దాటిపోవడంతో.. రీకౌంటింగ్ విషయంలోనూ అధికారులు  వైసీపీ డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదు. 


భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజవర్గం పులివెందులనే.  మొదటి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై గురి పెట్టి శ్రమించారు. ఇప్పటికే టీడీపీ తపున బీటెక్ రవి పులివెందుల నుంచి స్థానిక సంస్థ కోటాల కింద ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి  టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నట్లయింది. పశ్చిమ సీమలోనూ వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.  కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలిపి టీడీపీకి  గత ఎన్నికల్లో రెండు అంటే రెండు అసెంబ్లీ సీట్లు వచ్చాయి.  కడప, కర్నూలులో ఒక్కటీ రాలేదు. నాలుగేళ్లలోనే పరిస్థిత మారిపోవడం వైసీపీ వర్గాలకూ ఇబ్బందికరంగా మారింది.