తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య తరచూ ఫ్లెక్సీల వార్ జరిగే సంగతి తెలిసిందే. మోదీ పర్యటన సందర్భంగా ఆ ప్రదేశంలో ప్రధానికి వ్యతిరేకమైన ఫ్లెక్సీలను టీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం.. ఒకవేళ కేసీఆర్ పర్యటన ఉంటే ఆయన్ను విమర్శిస్తూ ఫ్లెక్సీలు కట్టడం షరా మామూలే అయిపోయింది. విమోచన దినం సందర్భంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ ఫ్లెక్సీల వార్ బాగా జరిగింది. ఆ తర్వాత కూడా ఒకరికొకరు పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ మధ్య మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ నేతలు విపరీతమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాజాగా మళ్లీ ఫ్లెక్సీల వార్ రాజేంద్రనగర్ లో కనిపించింది.






సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో వినూత్నంగా హోర్డింగ్స్‌ వెలిశాయి. అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత? కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? రాష్ట్రం ఇచ్చిన సొమ్మెంత? ప్రజలారా ఆలోచించండి అంటూ స్థానిక బీజేపీ నాయకులు హోర్డింగులు పెట్టారు. సొమ్మొకరిది - సోకొకరిది అనే సినిమా టైటిల్ పేరుతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అంతటా పోస్టర్లు అంటించారు. ఏకంగా హైవేలపై భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. 


రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. రాజేంద్రనగర్‌ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినది ఎంత? అంటూ లెక్కలతో సహా భారీ హోర్డింగ్స్‌ పెట్టారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.44 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చిందని ఫ్లెక్సీలపై రాశారు. రాష్ట్రం కేవలం రూ.25 కోట్లు మాత్రమే కేటాయించిందని రెండింటిని పోల్చుతూ ఫ్లెక్సీలపై ముద్రించారు. హైదరాబాద్ శివారున ఉన్న శంషాబాద్‌, బండ్లగూడ మండలాల్లో ఏ గ్రామాలకు ఎన్ని నిధులు అందాయి అనే విషయాలను స్పష్టంగా పోస్టర్లలో పేర్కొన్నారు. 






శంషాబాద్‌ మండలానికి కేంద్రం రూ.17 కోట్ల 81 లక్షలు రూపాయలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల 63 లక్షలు మాత్రమే ఇచ్చిందంటూ విమర్శించారు. బండ్లగూడ మండలానికి మోదీ ప్రభుత్వం రూ.5.82 కోట్లు కేటాయిస్తే, రాష్ట్రం 3.15 కోట్లు ఇచ్చిందంటూ పోస్టర్లు అంటించారు. ‘‘ప్రజలారా ఆలోచించండి - రాష్ట్ర అభివృద్ధిలో ఎవరి వాటా ఎంతో గమనించండి. నిజంగా అభివృద్ధి చేస్తున్నది ఎవరు? చేశామని చెప్పుకుంటున్నది ఎవరు? ప్రజలారా మేల్కోండి అంటూ బ్యానర్లు రాసి ఉంది.