Who Is Raja Singh : రాజాసింగ్ లోథ్ . ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే పేరు. హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండో సారి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ాయనను కాపాడేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపించలేదు. గంటల్లోనే సస్పెన్షన్ వేటు వేసింది. అయినా సరే తగ్గేదే లేదని ఆయనంటున్నారు. ఇంతకూ రాజాసింగ్ బ్యాక్‌గ్రౌండేమిటి ? ఏ ధైర్యంతో ఆయన ఇలా చెలరేగిపోతున్నారు ?
తల్లిదండ్రులు రాజస్థాన్, యూపీలకు చెందిన వారు
టి. రాజాసింగ్ లోథ్ .. ఈ పేరు చూస్తేనే అర్థమైపోతుంది ఆయన తెలుగువారు కాదని. అయితే ఆయన పుట్టింది .. పెరిగింది మొత్తం హైదరాబాద్ థూల్ పేటలోనే. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రాజాసింగ్ తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి.. ధూల్ పేటలో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుండి ఆయనకు చదువు అబ్బలేదు కానీ.. హిందూత్వ సంఘాలతో కలిసి పని చేసేవారు. ఈ క్రమంలో ఆయన గణేష్ , శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో నిర్వహించే శోభాయాత్రల్లో కీలకంగా వ్యవహరించేవారు. అలా గల్లీ లీడర్‌గా ఎదిగిన ఆయను..తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
గో సంరక్షణ, హిందూవాహిని కార్యక్రమాలతో పేరు - టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి !
తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయనకు కార్పొరేటర్ టిక్కెట్ లభించింది. మంగళహాట్ డివిజ్ నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. టీడీపీలో ఉన్నా ఆయనది హిందూ భావజాలమే. అయితే మరీ దూకుడుగా ఉండేవారు కాదు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి. అప్పటి వరకూ టీడీపీ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ గోషామహల్ సీటును తనకే దక్కేలా లాబీయింగ్ చేసుకుని బీజేపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. బీజేపీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు.
బీజేపీలో చేరి గోషామహల్ నుంచి ఎమ్మెల్యే
అయితే ఆయనది కరడుగట్టిన హిందూత్వ ఎజెండా. రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయనకు సఖ్యత ఉండేది కాదు. అందుకే డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత పార్టీతో విభేధించారు. చాలా సార్లు రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. ఓ సందర్భంలో శివసేన పార్టీకి తెలంగాణకు అధ్యక్షుడవుతారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఏం జరిగినా ఆయనకు గత ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ లభించింది. అంతే కాదు .. తెలంగాణ మొత్తం మీద ఆయన ఒక్కరు మాత్రమే బీజేపీ తరపున విజయం సాధించారు.
2018లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే
రాజాసింగ్ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో ముందు ఉంటారు. 2015లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేయడం.. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకోవడం వంటివి దుమారం రేపాయి. 2018 ఎన్నికల అఫిడవిట్ లో రాజాసింగ్ పేర్కొన్న వివరాలపై ప్రకారం... అతనిపై మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు 101 కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. రాజాసింగ్‌ను రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్‌బుక్ లేబుల్ చేసింది. ఫేస్‌బుక్ ఫ్లాట్ ఫారం నుంచి తొలగించింది.