బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. రాజాసింగ్‌ ఇంటి వద్ద వెస్ట్‌జోన్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్లి మరీ అరెస్టు చేశారు. షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.


అంతకు ముందు ఇంట్లోనే ఉన్నానంటూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అది సోషల్ మిడియా, మెయిన్ మిడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఆ విడియో విడుదలైన కాసేపటికే ఆయన ఇంటికి పోలీసులు చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. 


రాజాసింగ్‌కు ఈ ఉదయమే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ఇంకోసారి అరెస్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో రాజాసింగ్ తన లాయర్లతో చర్చలు జరుపారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ సహా షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లలో నమోదైన కేసులలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. 41 (ఏ) సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి. మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో, షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 


ఫిబ్రవరి 19, 2022న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మంగళ్‌హాట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏప్రిల్‌ 12న షా ఇనాయత్‌గంజ్‌లో కేసు మరో కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల వేళ, శ్రీరామ నవమి సందర్భంగా వివాదాస్పద కామెంట్స్ చేశారని ఈ ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 153(A), 295(A), 504, 505(2) కేసులు రిజిస్టర్ చేశారు. ఈ కేసులకు సంబంధించి సీఆర్‌పీసీ-41(A) కింద నోటీసులు రాజాసింగ్‌కు ఇచ్చారు. 


ఈ నోటీసులు జారీ అవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. ఆయన ఓ వీడియో విడుదల చేసి.. తనను మళ్లీ అరెస్ట్‌ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని, ఏప్రిల్‌ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని రాజా సింగ్ నిలదీశారు.


ఆ రోజు తాాను పోస్టు చేసిన వీడియోలో ఎక్కడా మహమ్మద్‌ ప్రవక్తపై కామెంట్స్ చేయలేదన్నారు. తాను టార్గెట్ చేసుకుంది స్టాండప్‌ కమెడియన్ మునావర్‌ను మాత్రమే అన్నారు. కానీ దానికి టీఆర్‌ఎస్‌ ఎంఐఎం కుట్ర పూరితంగా ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారాయన. దీన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు. 


ఈ వీడియో విడుదల చేసిన గంటలోపే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సంగతి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చారు. దీంతో రాజాసింగ్‌ను కోర్టుకు తరలించడం కష్టంగా మారింది. భారీ బందోబస్తు మధ్య రాజాసింగ్‌ను ముందు ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి... తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.