Rajasingh once again received threats from terrorists : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి టెర్రరిస్టుల నుంచి బెదిరింపలు వచ్చాయి. పాకిస్తాన్ నెంబర్ల నుంచి పదే పదే బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని నెంబర్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ ఫోన్ నెంబర్‌కు టెర్రరిస్టు ఫోటో కూడా ఉంది.
రాజాసింగ్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే అనేక సార్లు వచ్చాయి. కరుడుగట్టిన హిందూత్వ వాదిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ కు .. ఉగ్రవాదుల నుంచి తరచూ బెదిరింపులు వస్తూంటాయి. గతంలో కూడా ఇలా బెదిరింపులు రావడంతో పోలీసులు ఆరా తీశారు. పాతబస్తీకి చెందిన ఓ యువకుడు గల్ఫ్ దేశాల్లో ఉపాది పొందుతూ అక్కడ నుంచి రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేశారని గుర్తించారు.
రాజాసింగ్ కు టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉండటంతో గతంలో భద్రత కల్పించారు. ఎమ్మెల్యేగా ఆయనకు భద్రత ఉంటుంది. అయితే ఆయనకు ఉన్న ముప్పు కారణంగా ఇంకా ఎక్కువ భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోవం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తనకు ఓ పాత వాహనాన్ని కేటాయించారని.. అది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందని.. రాజాసింగ్ చెబుతూ ఉంటారు. ఆ వాహనం వల్ల రోడ్డుపై చతాలా సార్లు నిలిచిపోయి .. నడుచుకుంటూ పోవాల్సి వచ్చిందని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజాసింగ్ గతంలో ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. తర్వాత కూడా ఆయన అలజడి రేపడంతో అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసింది. చాలా రోజులు జైల్లో ఉన్న తర్వాత కోర్టు నుంచి ఊరట పొంది బయటకు వచ్చారు. నామినేషన్ల చివరి క్షణంలో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ టిక్కెట్ ను మరోసారి ఇచ్చింది. మూడో సారి ఆయన భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. బీజేపీ తరపున పలు రాష్ట్రాల్లో చురుకుగా ప్రచారం చేసే రాజాసింగ్ .. తనకు తెలంగాణ ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలని కోరుతున్నారు.