Telangana Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై  అసెంబ్లీ ఆమోదించిన పెండింగ్‌ బిల్లులను జూలై 15లోగా క్లియర్‌ చేస్తామని ప్రకటించారని సోమవారం ప్రచారం జరిగింది. మున్సిపల్‌, ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వీటికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారని.. ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు తొలగిపోయాయని కనిపించింది. ఈ వార్తలపై రాజ్ భవన్ ఘాటుగా స్పందించింది. 


తెలంగాణ రాజ్ భవన్ లో ప్రభుత్వం నుంచి ఏ బిల్లులు పెండింగ్ లేవు అని రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది. ఏదైనా వార్తలు రాసే ముందు, ప్రసారం చేసే ముందు వివరణ తీసుకుని ఇవ్వడం సరైన విధానమని మీడియాకు సూచించింది. ప్రస్తుతానికి గవర్నర్ కార్యాలయంలో ఎలాంటి బిల్లు పెండింగ్‌లో లేదని రాజ్ భవన్ సోమవారం రాత్రి స్పష్టం చేసింది. ప్రభుత్వం తమకు పంపిన బిల్లులలో మూడు బిల్లులు క్లియర్ అయ్యాయి. మరో రెండు బిల్లులు పరిశీలన కోసం రాష్ట్రపతి కార్యాలయానికి పంపించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. మిగిలిన బిల్లులు తగిన వివరణ కోరుతూ, పలు సూచనలతో ప్రభుత్వానికి తిరిగి పంపించినట్లు గుర్తుచేవారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌కు సంబంధించిన ఏదైనా వార్తలను ప్రసారం గాని, ప్రచురణ గాని చేసే ముందు అధికారికంగా రాజ్‌భవన్ నుండి వివరణ కోరాలని  రాజ్ భవన్ ఓ ప్రకటనలో మీడియాను కోరింది. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 


మరోవైపు రాష్ట్ర గ‌వ‌ర్నర్ త‌మిళి సై, తెలంగాణ ప్రభుత్వం మ‌ధ్య వివాదం సుప్రీంకోర్టులో ఉంది.  గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్ మొత్తం పది బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఆహ్వానాలు అందడం లేదన్న గవర్నర్ తమిళిసై!  
తెలంగాణలో సైతం గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సైతం పిలుపు రాలేదని గవర్నర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ఓ సెషన్ జరిపించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించారు. ఆ సమయంలోనూ గవర్నర్ తమిళిసై ఘాటుగా స్పందించారు. ప్రధాని చేతుల మీదుగా కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన పార్లమెంట్ ప్రారంభిస్తే బావుండేదని బీఆర్ఎస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలుపెట్టాయి. ఈ విషయంపై తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. రాష్ట్రపతిల మాదిరిగానే గవర్నర్లు కూడా రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన వేడుకలు, ప్రారంభోత్సవాలకు తనను ఆహ్వానించకపోవడంపై ఇలా వ్యాఖ్యానించారు. సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. తనకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తమిళిసై ప్రస్తావించడం తెలిసిందే. 
Also Read: Pawan Kalyan: సీఎం జగన్ ను పవన్ ఏకవచనంతో సంబోధించటం వెనుక కారణం ఇదేనా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial