ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఇందుకోసం ఆయన సోమవారం (జూలై 10) సాయంత్రం ప్రగతి భవన్ కు ముస్లిం ప్రతినిధులతో కలిసి వెళ్లారు. భేటీ అనంతరం అసదుద్దీన్ ఒవైసీ ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఉమ్మడి పౌర స్మృతి బిల్లును (Uniform Civil Code) తాము వ్యతిరేకిస్తామని ఒవైసీ స్పష్టం చేశారు. ఇదే విషయం గురించి సీఎం కేసీఆర్‌తో మాట్లాడామని అన్నారు. బీఆర్ఎస్ తరపున కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ ను కోరినట్లుగా చెప్పారు. దీనికి సంబంధించిన తమ విజ్ఞప్తులతో ఒక నోట్‌ను సీఎం కేసీఆర్‌కు ఇచ్చామని అన్నారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. 


యూసీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తోందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీనే మొదట తీర్మానం చేసిందని ఒవైసీ గుర్తు చేశారు. యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ చీఫ్ లను కలుస్తామని ఒవైసీ చెప్పారు. ఈ యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి అది రాకుండా అడ్డుకుంటామని అన్నారు.


యూసీసీ బిల్లు అనేది ముస్లింలకే కాకుండా హిందువులకు కూడా మంచిది కాదని ఒవైసీ అన్నారు. యూసీసీ అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం కూడా రద్దు అవుతుందని చెప్పారు. దేశంలో ఉన్న కోట్ల మంది గిరిజనులు యూసీసీ వల్ల ప్రభావితం అవుతారని చెప్పారు. ప్రధాని మోదీ అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుబట్టారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని, అలాంటి చోట యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు.