Dr Koneti Nageshwara Rao: పుట్టుకతోనే చిన్న పిల్లల గుండెలో ఏర్పడే రంధ్రాలను మూసి వేసేందుకు డాక్టర్ కోనేటి నాగేశ్వర రావు తయారు చేసిన వైద్య పరికరానికి భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్రపంచంలో ప్రతిరోజూ వెయ్యి మందిలో 10 మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో పుడుతున్నారు. అయితే ఆ లోపాల్లో 25 శాతం, వెంట్రిక్యులర్ సెఫ్టల్ డిఫెక్ట్ కు సంబంధించిన లోపాలే ఉంటున్నాయి. ఈ వ్యాధిలో గుండె యొక్క రెండు గదుల మధ్య ఉన్న రంధ్రం తెరిచి ఉంటుంది. వెంట్రిక్యులర్ సెఫ్టల్ డిఫెక్ట్ తో జన్మించిన పిల్లలు గుండె వైఫల్య లక్షణాలతో ఉండడం మాత్రమే కాకుండా ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, శ్వాస తీసుకోవడంలో సమస్య మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా వారిలో కనిపిస్తుంటాయి. అయితే ఈ రంధ్రాలను మూసివేసే పరికరాన్ని రూపొందించడానికి తెలుగు వైద్యుడు, ప్రముఖ చిన్న పిల్లల హృద్రోగ చికిత్స నిపుణులు, రెయిన్ బో హార్ట్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కోనేటి నాగేశ్వర రావు తన బృందంతో కలిసి పరిశోధనలు చేశారు. 2009లో ఆయన శ్రమ ఫలించింది. ఆయన రూపకల్పన చేసిన పరికరానికి కోనార్-ఎంఎఫ్ డివైజ్ గా నామకరణం చేశారు. దీనికి విదేశాల నుంచి కూడా అనుమతులు దక్కాయి.
ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే.. ట్రాన్స్ క్యాథన్ ద్వారా దీన్ని గుండె గదుల మధ్య ఉంచి రంధ్రాలను మూసివేస్తారు. మన దేశంతో పాటు జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా తదితర 72 దేశాల్లో ఇప్పటికే 1000 మంది చిన్నారులకు విజయవంతంగా దీన్ని ఉపయోగించారు. ఈ పరికరంపై 2012లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించగా... ఉత్తమ ఆవిష్కరణ కింద ఎంపిక అయింది. తాజాగా భారత ప్రభుత్వం ఈ పరికరానికి సంబంధించి తనకు పేటెంట్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చిందని డాక్టర్ నాగేశ్వర రావు వెల్లడించారు.