కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. ఈ యాత్ర నేడు హైదరాబాద్ చేరుకోనుంది. ఈ యాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కాస్త వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. రాహుల్ ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్... ముందు అమేథిలో గెలవాలను సూచించారు.
అంతర్జాతీయ లీడర్ అంటూ తన ట్వీట్ స్టార్ట్ చేశారు కేటీఆర్. కనీసం తన సొంత నియోజకవర్గం అమేథి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేని అంతర్జాతీయ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం బాగాలేదన్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన జాతీయ పార్టీ ఆకాంక్షపై కూడా విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు.
అక్కడితో ఆగిపోని కేటీఆర్... PM కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ ముందు తన అమేథీ ప్రజలను ఒప్పించి MPగా ఎన్నిక కావాలంటూ ఎద్దేవా చేశారు.
రాహుల్ ఏమన్నారు
టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తులేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న(అక్టోబర్ 30) అన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దని టీపీసీసీ నిర్ణయమని, దానిని స్వాగతిస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య పోటీ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మునుగోడు ఉపఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలోకాంగ్రెస్ దే అధికారం
అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తామది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదని రాహుల్ గాంధీ అన్నారు. చాలా సంవత్సరాల క్రితమే తాను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్నానని, కానీ కోవిడ్ విజృంభించడం, ఇతర కారణాలతో చేయలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదని, కచ్చితంగా పొలిటికల్ యాత్రే అన్నారు.