తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతి వివక్ష ఘటన సంచలనం రేపుతోంది. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఉన్న అంతర్జాతీయ ఐకియా స్టోర్‌లో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. భౌగోళికంగా నివాస పరంగా హైదరాబాద్‌లో ఎంతో సౌలభ్యంగా ఉండటంతో చాలా మంది ఇక్కడ నివసించేందుకు ఇష్టపడుతుంటారు. విశ్వనగరంగా పేరు గాంచిన హైదరాబాద్‌లో జాతి వివక్ష కలకలం రేపింది. ఇప్పటికే చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఐకియా.. తాజాగా జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటోంది.
నితిన్ సేథి అనే జర్నలిస్ట్ తన భార్యతో కలిసి హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ కు షాపింగ్ కోసం వెళ్లారు. అయితే ఎవరినీ అంతగా చెక్ చేయని సిబ్బంది తమను మాత్రం.. సెక్యూరిటీ పేరుతో ఇబ్బంది పెట్టి అవమానిచారని నితిన్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజెన్లు నితిన్ సేథికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఐకియా సిబ్బంది వ్యవహరించిన తీరు ఆమోద యోగ్యంగా లేదన్నారు. అంతర్జాతీయ ఐకియా స్టోర్ లో ఇలా చేయడం ఏంటని, ఇది కరెక్టు కాదని తెలిపారు. జర్నలిస్ట్ నితిన్ సేథికి వెంటనే క్షమాపణలు చెప్పాడని సూచించారు. కస్టమర్లతో గౌరవంగా ఎలా నడుచుకోవాలో సిబ్బందికి అవగాహని కల్పించాలని ఐకియా యాజమాన్యానికి సూచించారు.
ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ ఐకియా యాజమాన్యం.. తమ స్టోర్ ల వద్ద సమానత్వం మానవ హక్కు అని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల జాత్యాహంకారం, పక్షపాతులను తాము ఖండిస్తున్నామని.. బాధితులకు కల్గిన అవమానానికి చింతిస్తున్నట్లు ట్వీట్ చేసింది. జర్నలిస్ట్ నితిన్ సేథికి క్షమాపణలు తెల్పింది.