సులువుగా డబ్బు సంపాదించడానికి ఓ కేటుగాడు హైకోర్టు జడ్జి అవతారం ఎత్తాడు. పైగా గన్‌మెన్‌ను నియమించుకున్నాడు. ఫేక్ వెబ్ సైట్ తయారు చేయించి అమాయక ప్రజలను దోచేస్తున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని, అతడికి సహకరించిన వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి.. ఈజీ మనికి అలవాటు పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలు, వాహనాలు దొంగతనాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో 2017లో నరేందర్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆ తరువాత హైటెక్ మోసాలకు తెర తీశాడు. జమ్మూకాశ్మీర్ ఆర్మీలో పని చేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని గన్ మెన్‌గా నియమించుకున్నాడు.
ప్రజలను ఈజీగా మోసం చేసేందుకు ఒక నకిలీ వెబ్ సైట్ తయారు చేయించుకుని.. ప్రజలకు కోర్టు జడ్జిగా ప్రచారం చేసుకున్నాడు. భూ సమస్యలు ఏమైనా ఉన్నా తాను పరిష్కరిస్తానంటూ అమాయక ప్రజలకు ఎరవేసేవాడు. లక్షలు వసూలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా మోసాలకు పాల్పడుతుండంతో పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి వచ్చాక ఖమ్మం నుంచి మకాం హైదరాబాద్‌కు మార్చాడు.
హైదరాబాద్‌లో అడిషనల్ సివిల్ జడ్జిగా నరేందర్ చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు వసూల్ చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో అసలు విషయం అర్థమైంది.. నరేందర్ నకిలీ జడ్జిగా చలామణి అవుతూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.
జడ్జిగా నమ్మించేందుకు భారీ సెటప్
ప్రజలను సులువుగా మోసం చేసేందుకు నరేందర్ భారీ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించుకున్నాడు. నకిలీ వెబ్ సైట్ తయారు చేయించుకున్నాడు. నకిలీ విజిటింగ్ కార్డులు ముద్రించాడు. తనకు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించిందని నమ్మించేందుకు ప్రత్యేకంగా గన్‌మెన్‌ను నియమించుకున్నాడు. ఎంత చేసినా ఎప్పటికైనా దొంగ పోలీసులకు దొరకాల్సిందే. అలాగే ఓ సెటిల్‌మెంట్ వ్యవహారంలో పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడి నుంచి పోలీసులు ఒక తుపాకీ, 5 బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, క్యాష్, నకిలీ విజిటింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.