TSRTC News: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలు, వరదలు వస్తున్నందున రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో రెగ్యులర్‌ సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది.






ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోంది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలు దేరుతుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఏమైనా అనుమానాలు ఉన్నా, మరింత సమాచారం కావాలన్నా 040-69440000, 040-23450033 ఈ నంబర్లకు సంప్రదించమని సూచించారు.