Ayodhya Hotel Rooms:



వచ్చే ఏడాది జనవరిలో..


వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి. కేంద్రం వచ్చే సంక్రాంతికి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరపనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎంతో మంది వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. దశం నలుమూలల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకే..ట్రావెల్ ఏజెంట్‌లు ఇప్పటి నుంచే టూర్‌లు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే డిమాండ్ కూడా పెరిగింది. అయోధ్యలోని హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లు, ధర్మశాలల్లో బల్క్‌ బుకింగ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. 2024 జనవరి 20 నుంచి జనవరి 26 మధ్యలో బుకింగ్ రిక్వెస్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై హోటల్ యాజమాన్యాలు స్పందించాయి. ట్రావెల్ ఏజెంట్‌లు ముందుగానే వీటిని బుక్ చేస్తున్నట్టు చెబుతున్నాయి. 


"వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు  హాజరు కావాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ట్రావెల్ ఏజెంట్‌లు ముందుగానే మా హోటళ్లలో రూమ్స్ బుక్ చేస్తున్నారు. మేం డిమాండ్‌ని బట్టి రేట్‌లు పెంచినా సరే తీసుకుంటున్నారు. ఈ వేడుక సమయంలో సిటీ అంతా భక్తులతో నిండిపోతుంది. ప్రధాని మోదీకి ఇప్పటికే టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం  పంపించింది. ఈ ఉత్సవాన్ని చూడాలని వేరే రాష్ట్రాల ప్రజలూ ఉవ్విళ్లూరుతున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలున్నాయి"


- ఓ హోటల్ యజమాని


హోటల్‌ మొత్తం బుకింగ్‌..


కొంతమందైతే ఏకంగా హోటల్‌నే బుక్ చేసుకుంటున్నారు. అది కూడా ఎక్కువ ధరలకు. అడ్వాన్స్ కూడా కడుతున్నారు. అయోధ్యలో దాదాపు 100 హోటళ్లున్నాయి. వీటిలో ఒక 5 స్టార్ హోటల్ ఉండగా 12 త్రీ స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 50 గెస్ట్ హౌజ్‌లున్నాయి. ఢిల్లీ, ముంబయి నుంచి ఎక్కువగా ఎంక్వైరీలు వస్తున్నట్టు హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వీటిలో 40% మేర VIPలకే కేటాయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కనీసం 10 వేల మంది హాజరయ్యే అవకాశముందని రామ్ మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ అంచనా వేశారు. జనవరి 15-24 మధ్యలో ప్రారంభించవచ్చు అని ప్రధాని మోదీకి చెప్పినట్టు వివరించారు. ఇక తేదీ ఖరారు చేయాల్సింది మోదీయేనని వెల్లడించారు. 


ఆ రోజే ప్రారంభం..


రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏబీపీతో మాట్లాడుతూ.. "2024 జనవరి 15వ తేదీ అలాగే 24వ తేదీ జనవరి 2024 మధ్య శ్రీరామ చంద్రుడిని ప్రతిష్టించవచ్చని" అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల కోసం రామమందిరం తలుపులు తెరుస్తామని వివరించారు. జనవరి 24, 25 2024 వరకు సాధారణ భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని మిశ్రా తెలిపారు. 


Also Read: Lottery Jackpot: 25 రూపాయలు పెడితే రూ.10 కోట్లు వచ్చాయి - జాక్‌పాట్‌ అంటే ఇదీ