T Raja Singh Detained : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆయనను మంగళహాట్ పోలీసులు చేసి కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పిడి ఎసిటీ చట్టం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు. సమాజంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు,విద్వంశాలు చేసేవారు మీద ఈ చట్టం కింద 3 నుంచి 12 నెలలపాటు జైళ్లను పెట్టవచ్చు. నిర్బంధించవచ్చు. చట్టం ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని రక్షించడం. సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు.. అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడంఅసాధారణం. అయితే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
పీడీయాక్ట్ ప్రకారం మూడు నెలల నుంచి ఏడాది వరకూ జైల్లో పెట్టవచ్చు
పీడీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తిని మొదటి సందర్భంలో 3 నెలలు మాత్రమే నివారణ కస్టడీకి తీసుకెళ్లవచ్చు. నిర్బంధ కాలం 3 నెలలు దాటితే, హైకోర్టుల న్యాయమూర్తులుగా నియామకానికి అర్హత ఉన్న వ్యక్తులతో కూడిన సలహా బోర్డుకు కేసును సూచించాలి. సలహా మండలి ఆమోదం మేరకు మాత్రమే నిర్బంధ కాలం 3 నెలలకు మించి పొడిగించబడవచ్చు. ప్రజా ప్రయోజనంలో ఉంటే నిర్బంధానికి కారణాలను వెల్లడించాల్సిన అవసరం కూడా లేదు. పీడీ యాక్ట్ నమోదు చేస్తే న్యాయస్థానంలోనూ ఇబ్బందులు రావు.
2014 నుంచి ఇప్పటి వరకూ 101 కేసులు - రౌడిషీట్
మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నుంచి రాజాసింగ్‌పై ఇప్పటి వరకూ 101 కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు ఆయనపై రౌడీ షీట్ నమోదయి ఉంది. పద్దెనిమిది కేసులు మత పరమైన అల్లర్లకు సంబంధించినవి. ఈ రికార్డులను పరిశీలించిన తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.
చర్లపల్లి జైలుకు రాజాసింగ్ తరలింపు
రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన ఓ వర్గాన్ని తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో పలు కేసులు నమోదయ్యాయి. సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయించారు.