కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎల్బీనగర్‌కు వెళ్లారు. ఎల్బీ నగర్‌లో తెలంగాణ పోరాటంలో అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పించనున్నారు. శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకూ ఆమె పాదయాత్రగా వెళ్లనున్నారు. దీనికి నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ అని పేరు పెట్టారు. సరూర్ నగర్‌లో యువ సంఘర్షణ సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.


రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ఈ సాయంత్రం జరగనున్న సభలో యూత్ మేనిఫెస్టో ప్రకటించనుంది. గతేడాది వరంగల్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇవాళ జరగనున్న సభలో ప్రియాంకా గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటివి ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 


ట్రాఫిక్ మళ్లింపు..


కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయల‌్దే‌రి 4.45 గంటలకు సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5.45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 6.30 సమయంలో ఢిల్లీకి బయలు దేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.


వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు అంతా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఈ ర్యాలీ మేరకు అలాగే సరూర్ నగర్ లో జరగనున్న సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్ నగర్, ఎల్బీ నగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. విజయవాడ హైవే, సాగర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను చంపాపేట వైపు, నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుండి నాగోల్ వైపు మళ్లిస్తారు.