Andhra Pradesh Elections polling: ఆశ లావు పీక సన్నం అన్నట్టు ఉంది ప్రైవేట్ ట్రావెల్స్‌ వ్యవహారం. వేసవి సెలవులు, ఎన్నికల పోలింగ్ కోసం ఊరు వెళ్తున్న వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. సాధారంగా సెలవు రోజుల్లో ఉండే ఛార్జీలను ఐదారు రెట్లు పెంచేస్తున్నారు. సరిపడా బస్‌లు లేకపోయినా టికెట్లు అమ్మేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. 


ప్రవీణ్‌... ఓటు వేద్దామని ఊరు బయల్దేరాడు. తులసీ ట్రావెల్స్‌లో కుకట్‌పల్లి నుంచి టికెట్ బుక్ చేసుకున్నాడు. బస్‌ మధ్యాహ్నం 2 గంటలకు అని చెప్పారు. మాడు పగిలే ఎండతో వచ్చి చెప్పిన చోట నిల్చున్నాడు. అక్కడే మొదటి షాక్ ఇచ్చారు తులసీ ట్రావెల్స్ వాళ్లు. మినీ బస్‌ పెట్టి అందులో ఎక్కించారు. ఇదేంటని అడిగితే ముందు బస్ ఉందని చెప్పారు. సరే అని ఎక్కిన తర్వాత కొంత దూరం తీసుకెళ్లి ఆ బస్ ఆపేశాడు. 


అక్కడ మినీ బస్‌ దించేసిన ట్రావెల్స్ సిబ్బంది వేరే బస్‌లో ఎక్కమన్నారు. అక్కడ ప్రయాణికులంతా సిబ్బందితో గొడవ పడ్డారు. ఎక్కితే ఎక్కండి లేకుంటే లేదంటూ సిబ్బంది చాలా దురుసుగా సమాధానం చెప్పారు. సరే ఏదోలా గమ్యానికి చేరుకుంటే చాలు అన్నట్టు రుసరుస లాడుతూనే ప్రయాణికులు ఎక్కారు. 
కొంత దూరం వచ్చిన తర్వాత మళ్లీ దించేశారు. ఆబస్సు వెళ్లదు వేరే బస్ వెళ్తుందని చెప్పారు. ఇదేంటని అడిగింతే ఇంతేనంటూ చెప్పుకొచ్చారు. అక్కడ కాసేపు గొడవ జరిగింది. మళ్లీ ఎక్కించుకున్న తర్వాత ఎల్బీ నగర్‌ సమీపంలో తీసుకెళ్లి వదిలేశారు. అక్కడ మరో దాదాపు అర కిలోమీటర్ ప్రయాణికులను నడిపించాడు. 
ఇలా కుకట్‌పల్లి మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కిన ప్రయాణికులు ఎల్బీ నగర్ వచ్చేసరికి సాయంత్రం ఐదు అయింది. అక్కడ కూడా వేరే బస్ ఏర్పాటు చేశారు. అది కూడా పూర్తి స్థాయి ఏసీ బస్ కాదు. ఇదేంటని అడిగితే ఇలానే ఉంటుందని సిబ్బంది చాలా కటువు సమాధానం చెప్పారు.


దీనికి తోడు ఒక బ్యాగ్ ఉంటే మాత్రమే ఎక్కిస్తున్నారు. ఇతర లగేజీ ఏది ఉన్నా సరే కుదరదని చెప్పేస్తున్నారు. దీంతో ప్రయాణికులు సిబ్బందితో వాదులాడాల్సి వస్తోంది. బస్‌ల నిర్వహణ కూడా సరిగా లేదు. టైం సరికి బస్‌లు తీయడం లేదు. చిన్న పిల్లలతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 


ఈ తులసీ ట్రావెల్స్‌ బస్‌లు ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్నాయి. అక్కడ సిబ్బంది కూడా చాలా వరకు ఒడిశా వాళ్లే ఉన్నారు. ఇది ఒక్క తులసీ ట్రావెల్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. చాలా ట్రావెల్స్‌ ఇదే పని చేస్తున్నారు. సరిపడా బస్‌లు లేకపోయినా టికెట్‌లు బుక్ చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్న దురాశ వాళ్లది అయితే... ఏదోలా ఇంటికి చేరిపోవాలని ఆశ ప్రయాణికులది. 


ఇలా చుక్కలు చూస్తూ గమ్యాలకు చేరుతున్న వారు కొందరైతే... ఏదైనా బస్ రాకపోతుందా వెళ్లకపోతామా అని రోడ్లపై గంటల తరబడి ఎదురు చూస్తున్న వాళ్లు మరికొందరు. దీంతో హైదరాబాద్‌ రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. రెగ్యులర్‌గా ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నారు. 


ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొన్ని సమయంలో ఖాళీగా ఉండే మెట్రో కూడా రెండు రోజుల నుంచి చాలా రద్దీగా మారిపోయింది. మెట్రో స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇలా ఓవైపు ఎన్నికలు, మరోవైపు వేసవి సెలవులు కారణంగా హైదరాబాద్‌లో ప్రయాణ ప్రాంగణాలు మరో సంక్రాంతిని తలపిస్తున్నాయి.