TSPSC Question Paper Leaks: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసె కమిషన్ - టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిట్ అధికారుల దర్యాప్తులో విస్మయ పరిచే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ ఇద్దరు కలిసి అక్టోబర్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తానే వ్యవహరించే రాజశేఖర్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి వివరాలను అయినా దొంగలించి ప్రవీణ్ కు అందజేసే వాడని తేలింది.


రేణుక అభ్యర్థన మేరకే పేపర్ లీక్ చేశారన్నది అవాస్తవం


టీఎస్పీఎస్సీ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ చేసిన అక్రమాలు చూసి ఉన్నత అధికారులు సైతం విస్తుపోతున్నారు. టౌన్ ప్లానింగ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేయగా ప్రవీణ్ వ్యవహారం బయటపడింది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్ తో కలిసి ఏఈఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారన్నదంతా అబద్ధమని తేలింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేవలం ఏఈఈ పరీక్షకు మాత్రమే పరిమితం కాలేదని, అలా నమ్మించేందుకు మాత్రమే రేణుక ప్రస్తావన తెచ్చాడని తేలింది. వాస్తవానికి మిగతా ప్రశ్నాపత్రాలనూ ప్రవీణ్, రాజశేఖర్ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది.


అక్టోబర్ లోనే ప్రశ్నాపత్రల దొంగతనం


కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగలించి దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్నాపత్రాలు ఉన్న ఫోల్డర్ ను నాలుగు పెన్ డ్రైవ్ లలో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అక్టోబరులోనే ప్రశ్నాపత్రాలు తస్కరించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబర్ లో జరిగిన గ్రూపు-1 ప్రిలీమ్స్ లో ప్రవీణ్ కు మంచి మార్కులు వచ్చాయి. ఈ విషయం అధికారులకు తెలియడంతో కొత్త అనుమానాలు వచ్చాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా.. అక్టోబరు నుండే ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.


పక్కదారి పట్టించేందుకే పెన్ డ్రైవ్ నాటకం 


అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే పెన్ డ్రైవ్ నాటకం ఆడారని తేలింది. ఏడాది క్రితం టీఎస్పీఎస్సీ ఆఫీసులోని కంప్యూటర్లను అప్ గ్రేడ్ చేశారు. అప్పటి నుంచే రాజశేఖర్, ప్రవీణ్ కంప్యూటర్లను హ్యాక్ చేయాలని పతకం పన్నినట్లు అధికారులు గుర్తించారు. కార్యదర్శి, ఛైర్మన్ లకు మాత్రమే ఆజమాయిషీ ఉండే కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్లలో ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్.. నెట్ వర్క్ అప్ గ్రేడెషన్ పేరుతో డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చేశాడు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్ ను హ్యాక్ చేశాడు. అలా అక్టోబరులో జరిగిన గ్రూపు-1 ప్రశ్నాపత్రాన్ని దొంగలించాడు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు గ్రూప్-1, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీడీపీఓ, సూపర్ వైజర్ గ్రేడ్-2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ ఇలా మొత్తం 7 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. వీటన్నింటి ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూపు-1లో 100 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారందర్నీ పిలిచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. లీకైన ప్రశ్నాపత్రాలు పొంది వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.