- బీజేపి బీ పార్టీ జేడీఎస్..
- కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాం
- బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాం
- తెలంగాణలో మాకు కాంగ్రెస్ మద్దతివ్వాలి
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వీడియో


కర్ణాటకలో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో తాము మద్దతిచ్చి వారి విజయంలో పాత్ర పోషించామని, తెలంగాణలో ప్రజలు ప్రజా శాంతి పార్టీని కోరుకుంటున్నారు, కనుక మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కేఏ పాల్ కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ ఎన్నికల కోసం వేల కోట్లు ఖర్చు చేశారని సంచలనానికి తెరతీశారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలుమార్లు కర్ణాటకుకు వెళ్లి బీజేపీ మాజీ ఎంపీ, రెండేళ్లుగా కర్ణాటక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తమ సందేశం ఇచ్చామన్నారు. తమ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉందన్నారు. అందువల్లే తాము కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ, కాంగ్రెస్ కు మద్దుతు ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో ప్రభావం చూపించామన్నారు.


కర్ణాటక ఎన్నికల్లో తాము పోటీ చేస్తే ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని, మరోవైపు బీజేపీ లాభపడే అవకాశం ఉందని భావించి ప్రజా శాంతి పార్టీ బరిలోకి దిగలేదన్నారు. బీజేపీ బీ పార్టీ జేడీఎస్ మద్దతుతో అధికారంలోకి రావాలని కమలనాథులు ప్లాన్ చేశారని ఆరోపించారు. దేవేగౌడ, కుమారస్వామిలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని, అయితే తాము కాంగ్రెస్ కు మద్దతు తెలిపి గెలిపించుకున్నాం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బారి నుంచి కర్ణాటక ప్రజలకు కాపాడుకున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలని ప్రార్థించి, ప్రయత్నించి విజయం సాధించామన్నారు కేఏ పాల్. 



తెలంగాణలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా లేదని తెలుసు. గత ఏడాది 150 కార్పొరేటర్ సీట్లలో కేవలం ఒక్క సీటు గెలిచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. హుజూరాబాద్ లో అయితే 3 లక్షల పైచిలుకు ఓట్లు పోలైతే కాంగ్రెస్ కు కనీసం 3 వేల ఓట్లు కూడా రాలేదన్నారు. కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా పడలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కనుక మల్లు రవి, వీ హనుమంతరావు, భట్టి విక్రమార్కలను తమ ఓటు బ్యాంకు చీల్చవద్దని పదే పదే రిక్వెస్ట్ చేశామన్నారు.


తెలంగాణ ఎన్నికల్లో మాకు మద్దతివ్వండి 
తెలంగాణలో ఒకటి రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం కంటే.. 10 మందిలో ఐదారు మంది ప్రజా శాంతి పార్టీని కోరుకుంటున్నారని చెప్పారు. కనుక బీజేపీని బీజేపీ బీ పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఓడించాలని చిత్తశుద్ధితో రమ్మని కాంగ్రెస్ నేతల్ని ఆహ్వానించానని వీడియోలో తెలిపారు. కర్ణాటకలో తాము ఏ విధంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చామో, తెలంగాణలో ప్రజా శాంతి పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలను కేఏ పాల్ కోరారు. తెలుగు రాష్ట్రాలను, దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ నుంచి రక్షించుకుందామని తాజాగా వీడియో ద్వారా సందేశం పంపించారు.