Bathukamma Festival: తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు తొమ్మిది రోజులపాటు తెంగాణ వ్యాప్తంగా ,గ్రామగ్రామాన తీరొక్కపూలతో, భక్తిశ్రద్దల నడుమ జరుపుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు భుజానెత్తుకున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ ఎస్, బిజేపీకి తోడు ఈఏడాది వేరుకుంపటి పెట్టిన తెలంగాణ జాగృతి వరకూ ఇలా వివిధ రాజకీ పార్టీలు బతుకమ్మ వేడుకలను తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో బతుకమ్మ చీరలు, పాటలు ఒకటేమిటి, ఏం చేసినా బతుకమ్మపై భక్తిని మరచి,పొలిటికల్ టార్గెట్ గా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తెలంగాణలో ఈ ఏడాది బతుకమ్మ పట్టణాలకు మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రపండుగా మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సజ్జల బతుకమ్మ వరకూ భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసామంటోంది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనెల 26వ తేది వరకూ తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాాలలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 27వ తేది నుంచి 30వ తేదీ వరకూ హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకులను కనివినీ ఎరుగని స్దాయిలో నిర్వహిస్తున్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 28వ తేదిన లాల్ బహుదూర్ స్డేడియంలో 63 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి గన్నీస్ బుక్ రికార్డును సొంతం చేసుకోబోతున్నామని చెబుతున్నారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ, బతుకమ్మ వేడుకల్లో పంచే చీరలకు ఇందిరమ్మచీరగా పేరు మార్చడంపై పొలిటికల్ దుమారం రేగుతోంది. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేర్లేంటని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతుకమ్మ పేరు లేదా తెలంగాణ మహిళల పేర్లు పెట్టాలికానీ ,ఇలా ఇందిరమ్మపేర్లు పెట్టడం వల్ల తెలంగాణ తల్లికి బతుకమ్మను దూరం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ ఎస్ సైతం బతుకమ్మ వేడుకలను వైభవంగా జరిపేందుకు కేడర్ ను సన్నద్దం చేసింది. ఇప్పటికే బిఆర్‌ఎస్ మహిళా నేతలు ఆయా జిల్లాలలో బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నారు. కానీ బిఆర్ఎస్ నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో సైతం పొలిటికల్ అజెండా బలంగానే వినిపిస్తోంది. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పాటను బిఆర్ ఎస్ పార్టీ అవహేళన చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ఉయ్యాల.. ఉయ్యాలో బతుకమ్మ అంటూ పాటను ప్రచారం చేయడం, అదే పాటతో బతుకమ్మ ఆడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విమర్శలు చేయాలంటే బతుకమ్మ పాటలను వాడుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బిజెపి మహిళా మోర్చఆద్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు గతంలో ఎన్నడూ విధంగా వినూత్నంగా నిర్వహించడంతోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళలతో మండల స్దాయిలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టిన కవిత సైతం బతుకమ్మ వేడుకుల‌్లో తనకున్న బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నారు. జాగృతి అనుబంధ సంస్దల ఆధ్వర్యంలో ఇప్పటికే తన తండ్రి సొంత గ్రామం చింతమడక నుంచి బతుకమ్మ వేడుకులను ప్రారంభించిన కవిత తొమ్మిదిరోజులపాటు తెలంగాణవ్యాప్తంగా వివిధ జిల్లాలలో బతుకమ్మ సంబురాలలో పాల్గొంటూ జాగృతి మార్క్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకులను కేవలం పొలిటికల్ అజెండాతో నిర్వహిస్తూ , తెలంగాణ తల్లికి బతుకమ్మను దూరం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాాయి. కల్మషంలేని తీరొక్కపూలతో జరిగే వేడుకులకు ఈ రాజకీయ రంగులేంటనే  ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.