Telangana Local Body Elections | కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఖరారు చేసే కుట్ర పన్నుతుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలోని కుల గణన సర్వే పూర్తి వివరాలు బయటపెట్టడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండిస్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కులగణన సర్వే (Caste Census Survey) వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే అని వ్యాఖ్యానించారు. గ్రామపంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తుందని, రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల కిందటే కులగణన సర్వే వివరాలు వెల్లడించింది. ఏ కులం, మతానికి చెందిన వారు తెలంగాణలో ఎంత మంది ఉన్నారో లెక్కలు అసెంబ్లీ వేదికగా సైతం తెలిపింది. అయితే కుల గణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
బీసీల రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం..
కొన్ని రోజుల కిందట బీసీల రిజర్వేషన్లు పెంపు కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష చేశారు. తరచుగా బీసీ సంఘాల నేతలను కలిశారు. అన్ని పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మద్దతు తెలపాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు వివరాలు సమర్పించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ సర్పంచ్ ఎన్నిలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సంబంధిత అధికారులు రూపొందించిన జాబితా, వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.
పూర్తి కావొస్తున్న హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్
జులై నెలలో హైకోర్టు సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి డెడ్ లైన్ ఇవ్వడం తెలిసిందే. మరో వారం రోజుల్లో సెప్టెంబర్ పూర్తి కావొస్తుంది. బీసీ రిజర్వేషన్లను తన రాజకీయ అంశంగా తీసుకుని పోరాటం చేస్తున్న కవిత తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర ఆరోపణలు చేశారు. కులగణన సర్వే వివరాలు పూర్తిగా ప్రజలతో పంచుకోవాలని, గ్రామపంచాయతీల వారీగా కులగణన వివరాలను బహిర్గతం చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ప్రభుత్వం హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. బీసీల రిజర్వేషన్లు పెంపు కోసం తెలంగాణ జాగృతి పోరాటం ఆపదని కవిత స్పష్టం చేశారు.