Gulzar House Tragedy : హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన గుల్జార్‌హౌస్‌ దుర్ఘటన అందర్నీ కలచి వేసింది. చిన్నా పెద్ద 17 మంది చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. ఇంతటి పెద్ద ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నికోణాల్లో విచారణ చేస్తున్నారు. అందర్నీ విచారిస్తున్నారు. అయితే ఏసీ కంప్రెషర్ పేలడంతోనే దుర్ఘటన జరిగినట్టు ప్రస్తుతానికి ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.

వేసవి కాలం కావడంతో ఏసీలను నాన్‌స్టాప్‌గా వాడటం మొదలు పెట్టారు. దీని వల్ల కంప్రెషర్స్‌పై విపరీతమైన ఒత్తిడి పడింది. దీంతో అవి ప్రమాదానికి గురయ్యాయని పోలీసులు తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలుడుతోనే ఇంతటి ఘోరం జరిగిందని అంటున్నారు. ఆ పేలుడుతో ఏర్పడిన అగ్ని కీలలు పక్కనే ఉన్న విద్యుత్ మీటర్లకు వ్యాపించాయి. అలా మిగతా ఏసీలకు మంటలు అంటుకోవడంతో పొగ కమ్మేసింది. ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో అంతా మంటల్లో చిక్కుకున్నారని అంటున్నారు. ఇదంతా త్వరత్వరగా జరిగిపోయిందని చెబుతున్నారు. 

ఎంట్రన్స్‌, ఎగ్జిట్‌ ఒకటే కావడంతో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. కిందికి వచ్చే క్రమంలో మంటలు ఎక్కువగా ఉన్నాయని పైనే ఉండిపోయారని చెబుతున్నారు. అందుకే పొగ వ్యాపించి ఊపిరిఆడలేదని వివరించారు. దీని వల్ల వారంతా అపస్మారక స్థితికి వెళ్లిపోయారని అంటున్నారు. అగ్నిమాపక సిబ్బందికి వెళ్లేసరికి అంతా కిందపడి ఉన్నారని చెబుతున్నారు. కొందరు పక్కనే ఉన్న బిల్డింగ్‌పైకి అతి కష్టమ్మీద వచ్చి తప్పించుకున్నారని తెలిపారు. 

దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మరణం చాలా దురదృష్టకరమని అన్నారు. అయినా ఇది కనువిప్పు కలిగించాలని పేర్కొన్నారు. ఇప్పుడు కడుతున్న భవనాలు రూల్స్‌కు అనుగుణంగానే ఉంటున్నాయని లేకుంటే అనుమతులు రావడం లేదని చెబుతున్నారు. కానీ పురాతన భవనాల విషయంలో మాత్రం ఇది జరగలేదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు అన్నీ అలాంటి భవనాల్లోనే చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 

గుల్జార్‌హౌస్‌లో కూడా అగ్ని ప్రమాదాన్ని గుర్తించినా ఎటు వెళ్లాలో అర్థం కాకపోవడంతోనే ప్రాణ నష్టం జరిగిందని అన్నారు రంగనాథ్. ఆ భవనానికి వచ్చిపోయే మార్గం ఒకటే ఉందని అన్నారు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి పరిగణలోకి తీసుకొచ్చి చట్టంలో మార్పులు చేర్పులు చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకెళ్లి హైడ్రా తరఫున ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టే ప్రయత్నం చేస్తామన్నారు. 

పురాతన భవనాల నిర్మాణాల్లో మార్పులు చేర్పులు చేయలేమని కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కచ్చితంగా ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు రంగనాథ్. ఇప్పుడు చాలా మంది పురాతన భవనాల్లోనే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారని సెల్లార్‌లోనే వంటలు చేస్తున్నారని, కొన్ని భవనాల్లో విద్యుత్ వైరింగ్ సరిగా ఉండటం లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవచ్చే అనే ప్రయత్నమైన చేయొచ్చన్నారు. 

కొన్ని భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి ఉన్నారని తెలిసినా, అధికారులు చెప్పినా మార్పులు రావడం లేదని రంగనాథ్ అన్నారు. దీని వల్ల ఆప్రాంతాల్లో ఉండే ప్రజలు గమనించాలని తెలిపారు. ఇలాంటి భవనాలు గుర్తించి చర్యలు తీసుకుంటే ఏదో వర్గమో, రాజకీయ పార్టీలో వచ్చి ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అధికారులు హెచ్చరికలను ఒకరిద్దరు పాటించకుంటే దాన్ని చూసి మరికొందరు అదే బాట పడుతున్నారని అన్నారు. పాటించేలా చర్యలు తీసుకుంటే ఒత్తిడి వస్తుందని వాపోయారు. అయినా సరే వదలకుండా ప్రయత్నిస్తే కచ్చితంగా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రభుత్వం వద్ద జరిగే అగ్ని ప్రమాదాలపై మాట్లాడతామని చెప్పుకొచ్చారు.